దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అనేక రాష్ట్రాల్లో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అడ్డుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ప్రాంతాల్లో..
కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడమే కాక.. ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. అనుమానాస్పదంగా కనిపించిన నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో భారీ ఎత్తున బంగారం, నగదు స్వాధీనం చేసుకోగా.. తొలిసారి ఓ ప్రాంతంలో ఏకంగా 900 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని సీజ్ చేశారు. ఆ వివరాలు.. ఈ ఘటన తమిళనాడులో వెలుగు చూసింది. ఎన్నికల వేళ తమిళనాడులో ఇంత భారీ ఎత్తున బంగారం బయటపడటం సంచలనంగా మారింది.. కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్ పరిధిలోని కుండ్రత్తూర్ రహదారిలో ఫ్లయింగ్ స్క్వాడ్ శనివారం రాత్రి వాహనాల తనిఖీ చేపట్టింది. అటుగా వచ్చిన ప్రైవేటు సెక్యూరిటీ సంస్థకు చెందిన మినీ లారీ, మినీ కంటెయినర్ లారీలను సోదా చేశారు. ఓ లారీలో 1,025 కిలోలు, మరో వాహనంలో 400 కిలోల బంగారం ఉన్నట్లు గుర్తించారు అధికారులు.
వాటిని స్వాధీనం చేసుకుని.. వివరాలు ఆరా తీశారు. ఇంత భారీ మొత్తంలో బంగారాన్ని చెన్నై విమానాశ్రయం నుంచి శ్రీపెరుంబుదూర్ సమీప మన్నూర్‌లోని ఓ గోదాముకు తరలిస్తున్నట్లు అధికారుల దర్యాప్తులో తెలిసింది. అయితే దీనిలో 400 కిలోల బంగారానికి సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయని.. మిగిలినదానికి లేనట్లు తెలిసింది. దాంతో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు చెన్నై విమానాశ్రయ కస్టమ్స్ అధికారులను సంప్రదించారు. ఇక ఈ బంగారం మొత్తం విలువ సుమారు రూ.900 కోట్లు ఉంటుందని అంచనా. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. ఎలక్షన్ ప్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఓ పంచాయితీ ప్రెసిడెంట్ ఇంటి నుంచి కోటి రూపాయాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తానికి సంబంధించి అధికారులకు విశ్వసనీయ సమాచారం లభించడంతో.. వారు దాడి చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో ఎట్టారై గ్రామం పంచాయితీ ప్రెసిడెంట్ దివ్య అన్బరసన్ నుంచి ఈ సొమ్మును రికవరీ చేశారు. ఆమె అన్నాడీఎంకేకు చెందిన నేత కావడం విశేషం.