ప్రపంచంలోనే అత్యధిక జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోన్న ఏడు దేశాల్లో జపాన్ ఒకటి. రోజు రోజుకూ అక్కడ జనాభా తగ్గిపోతుంది. గతేడాది పోల్చితే 0.54 శాతం మేర తగ్గుదల నమోదయ్యింది. 2020 నాటికి 12.8 కోట్లగా ఉన్న జనాభా.. ఈ శతాబ్దపు చివరి నాటికి 5.3 కోట్లకు చేరే ప్రమాదం ఉందని లాన్సెట్ అధ్యయనం హెచ్చరించింది. అక్కడ జనాభా సంక్షోభానికి అద్దం పట్టే ఘటన ఇది. జపాన్‌లో రికార్డుస్థాయిలో ఖాళీగా ఉన్న ఇళ్ల సంఖ్య 9 మిలియన్లకు చేరినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఖాళీ ఇళ్లను ఒక్కొక్కరికి ఇచ్చుకుంటూ పోతే ప్రపంచ ఆర్ధిక రాజధాని న్యూయార్క్‌లో నగర జనాభాకు సరిపోతాయి. అక్కడ ఇలా ఖాళీగా వదిలేసిన ఇళ్లను ‘అకియా’ అంటారు. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో దూరంగా నివాసాలను కూడా ఈ పేరుతోనే పిలిచేవారు.
ప్రధాన నగరాలైన టోక్యో, క్యోటోల్లో కూడా ‘అకియా’లు చాలా వరకు దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు ఇదే వారికి ప్రధాన సమస్యగా మారడం గమనార్హం. ఈ సమస్యపై కాండా యూనివర్సిటీ ప్రొఫెసర్ జెఫ్రీ హాల్ మాట్లాడుతూ.. ఇది భారీ సంఖ్యలో ఇళ్ల నిర్మాణం వల్ల తలెత్తిన సమస్య కాదని వ్యాఖ్యానించారు. తగ్గుతున్న జననాల రేటుకు నిదర్శనమని పేర్కొన్నారు.
జపాన్‌లో వృద్ధుల సంఖ్య భారీగా పెరుగుతుంటే... జననాలు తగ్గిపోతున్నాయి. ఇలా ఇళ్లు ఖాళీగా ఉండటానికి ఇదే ప్రధాన కారణం. అక్కడ మొత్తంగా 14 శాతం ఇళ్లు ఖాళీగానే ఉన్నట్లు జపాన్ అంతర్గత వ్యవహారాల శాఖ నివేదిక పేర్కొంది. కొందరికి రెండేసి ఇల్లు, ఇటీవల ఖాళీ అయిన నివాసాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేవలం హౌసింగ్ మార్కెట్‌ను దెబ్బతీయడమే కాదు.. భూకంపాలు, సునామీ, వరదలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సహాయక చర్యలకు ఇలాంటి ఖాళీ ఇళ్లు ఆటంకంగా మారుతున్నాయి.
జపాన్ వాసులు ఈ ఖాళీ ఇళ్లను తమ వారసులకు అందజేస్తుంటారు. కానీ, జనాభా తగ్గిపోవడం, ఉన్న యువత నగరాలు, పట్టణాల్లో స్థిరపడటంతో వీటి నిర్వహణ సాధ్యం కాదు. దీంతో రికార్డుల్లో లేని నివాసాలను అధికారులు స్వాధీనం చేసుకొంటున్నారు. పాతవి కూల్చి కొత్తది నిర్మించడం కంటే వాటిని అలాగే ఉంచడమే ఉత్తమమని ప్రజలు భావించడం కూడా అకియాలు పెరగడానికి ఓ కారణం. ఖాళీగా ఉన్న నివాస ప్రాంతాలకు రవాణా సౌకర్యాలను రద్దు చేయడంతో వాటిని కోనుగోలుచేయడానికి ఎవరూ ముందుకు రావడంలేదు.
అయితే, నిరుపయోగంగా ఉన్న ఇళ్లను విదేశీయులు కొనుగోలు చేసి.. గెస్ట్‌హౌస్‌ల్లా మార్చుకుంటున్నారు. మార్పులు చేసిన ఈ ఇళ్ల ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పెడుతుండగా .. భారీ సంఖ్యలో ఫాలోవర్లు వస్తున్నారు. అయితే ఇలాంటివి కేవలం తక్కువ సంఖ్యలోనే ఉంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. కానీ, జపాన్ గ్రామీణ ప్రాంతాల్లో విదేశీయులు నివాసం ఉండటం చాలా క్లిష్టమైందని, భాష ప్రధాని అడ్డంకి అని అంటున్నారు. జనావాసాలు లేని గృహాలు కొనుగోలు చేసి, వాటిని తిరిగి విక్రయించడం దాదాపు అసాధ్యమని రియల్ ఎస్టేట్ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, ఈ సమస్య ఒక్క జపాన్‌కే పరిమితం కాదని.. అమెరికాతో పాటు యూరప్‌లోని కొన్ని దేశాల్లో ఇదే పరిస్థితి నెలకుందని తెలిపారు.