ఒడిశా హైకోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. ఆరేళ్ల బాలికపై హత్యాచారం కేసులో దోషిగా తేలిన ఓ ఖైదీకి మరణశిక్షను రద్దు చేసింది. అందుకు కోర్టు తెలిపిన కారణం విన్న ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకుంటున్నారు. అసలేం జరిగిందంటే.. ఎస్‌కే ఆసిఫ్ అలీ (36) అనే వ్యక్తి ఆరేళ్ల బాలికను 2014లో అత్యాచారం చేసి, హత్య చేశాడు. ఈ కేసులో ఒడిశాలోని జగత్‌సింగ్‌పుర్‌లో ఉన్న పోక్సో కోర్టు మరణశిక్ష విధించింది. అయితే తాజాగా ఈ కేసును విచారించిన హైకోర్టు అతడికి విధించిన మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చింది. ఇందుకు సంబంధించి జూన్ 27న 106 పేజీల తీర్పును హైకోర్టు ఇచ్చింది. తీర్పు సమయంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో దోషిగా తేలిన ఆసిఫ్ అలీ రోజూ దేవుణ్ని ప్రార్థిస్తున్నాడు. రోజులో ఎన్నోసార్లు నమాజ్ చేస్తున్నాడు. అతడు దేవుడి ముందు లొంగిపోయాడు. తాను చేసిన నేరాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే అతడికి విధించిన మరణశిక్షను జీవితఖైదుగా మారుస్తున్నామని తీర్పు సమయంలో హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అలాగే బాధిత బాలిక కుటుంబానికి రూ.1.50 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని పోక్సో కోర్టు ఆదేశించగా దాన్ని సవరించిన కోర్టు రూ.10 లక్షలు అందించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. తీర్పును రచించిన జస్టిస్ సాహూ.. అలీ మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చడానికి అదనపు కారణాలనూ జోడించారు. నిందితుడికి 63 యేళ్ల వయసున్న వృద్ధ తల్లి, ఇద్దరు అవివాహిత సోదరీమణులు ఉన్నారని.. వారంతా అతనిపైనే ఆధారపడ్డారని, అతని కుటుంబ ఆర్ధికపరిస్థితి ఏమాత్రం బాగాలేదని వ్యాఖ్యానించింది. పైగా జైలులోనూ అతను సత్ర్పవర్తనతో ఉన్నాడని సమర్ధించింది. ఈ మేరకు ట్రయల్ కోర్టులో SK సాహూ, RK పట్నాయక్‌లతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పును వెలువరించింది.
దీంతో హైకోర్టు తీర్పును ప్రతి ఒక్కరూ తప్పుబడుతున్నారు. ఒక ఖైదీ రోజుకు పలుసార్లు నమాజ్ చేసినంత మాత్రాన మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా ఎలా మార్చుతారంటూ పలువరు న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు.