రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీపై ఇప్పటికీ ఏదోక చోట విమర్శలు వస్తుంటాయి. రామాయణం ఆధారంగా తెరకెక్కించిన ఈ మూవీపై ప్రేక్షకులు పెదవి విరిచారు. ఇందులో ఓం రౌత్ చూపించిన సన్నివేశాలు, పాత్రలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది.
ఇటీవల విడుదలైన హనుమాన్ సినిమా విషయంలోనూ ఓం రౌత్ పై విమర్శలు గుప్పించారు. అయితే తాజాగా ఆదిపురుష్ మూవీ ట్రోల్స్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు నటుడు బిజయ్ ఆనంద్. ప్రస్తుతం ఆయన బడే మియాన్ చోటే మియాన్ చిత్రంలో నటించారు. ఈ మూవీ ప్రమోషనల్లో పాల్గొన్న ఆయన.. ఇండియాటుడే.ఇన్‌తో మాట్లాడుతూ… “నేను చిత్రకళా ప్రేమికుడిని, పెయింటింగ్ కాన్సెప్ట్ ఏంటంటే.. పెయింటర్‌కు ఎదురుగా ఖాళీ కాన్వాస్ ఉంటే.. దానిపై ఏం చిత్రించాలనేది ఆర్టిస్ట్‌గా వారి ఇష్టం. ఇది వారి ఎంపిక, కాన్వాస్, డబ్బు, సమయం. రూ. 600 కోట్లు ఖర్చు చేసి ఓం రౌత్ దర్శకుడిగా రూపొందించిన ఆ సినిమాకు అతడి కాన్వాస్, పెయింట్, రంగుల ఎంపిక అనేది తన ఇష్టం. మీకు నచ్చకపోతే చూడకండి. కళను విమర్శించడానికి మనం ఎవరు? కళను విమర్శించడం ప్రారంభించారంటే మీరు ఇంకా దిగజారిపోతున్నారని అర్థం. మంచి కళ లేదా చెడు కళ అనేది మీరు చెబితే అయిపోదు. అది కళాకారుడు ఇచ్చే వివరణ. మీకు నచ్చకపోతే మంచి, చెడు అని పిలవకూడదు. నేను ఎవరి పక్షం వహించను. కేవలం న్యాయంగానే ఉంటాను. మనం ప్రజలను కూర్చొబెట్టి తీర్పు చెప్పడం చేస్తే సమాజం ఏం చేస్తుంది.. వారంతా ఎప్పటికీ కళాకారులను భయపెడుతుంటారు.
కళను విమర్శించకూడదు. అలాగే దర్శకులను మళ్లీ ఆలోచించకుండా ఉండేలా భయపెట్టకూడదు. విజయానికి మార్గాన్ని సృష్టించాలి కానీ.. విమర్శలతో వెనకడుగు వేసేలా విమర్శించకూడదు. ఓంరౌత్ కు ట్రోల్స్ గురించి భయం లేదు. అతడు చాలా ధైర్యవంతుడు. అందుకే అతడు నాకు ఇష్టం ” అని అన్నారు. ప్రస్తుతం బిజయ్ ఆనంద్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.🎥✨