పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్నేహితుడిగా నటించిన జగదీశ్ ప్రతాప్ భండారి అలియాస్ కేశవ వివాదంలో చిక్కుకున్నాడు. అతనిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్నేహితుడిగా నటించిన జగదీశ్ ప్రతాప్ భండారి అలియాస్ కేశవ వివాదంలో చిక్కుకున్నాడు. అతనిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో పోలీసులు జగదీశ్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. వివరాల్లోకి వెళితే.. ఓ జూనియర్ ఆర్టిస్టు మరో వ్యక్తితో ఉన్నప్పుడు ఫొటోలు తీసి వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానని బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడినట్లు జగదీశ్‌పై ఆరోపణలున్నాయి. ఈ నటుడి వేధింపులతో పంజాగుట్ట పరిధిలో నివాసం ఉంటున్న ఒక మహిళ (జూనియర్ అర్టిస్టు) గత నెల 29న ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. మహిళ ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకున్నారు. అందులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆత్మహత్య చేసుకున్న సదరు మహిళ గత నెల 27న ఓ వ్యక్తితో ఉన్న సమయంలో ఆమెకు తెలియకుండానే జగదీశ్ ఫొటోలు తీశాడట. ఆ తర్వాత వాటిని చూపించి బెదిరించాడట. దీంతో మనస్థాపానికి గురైన మహిళ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిందని పోలీసులు చెబుతున్నారు.
కాగా ఈ కేసులో తప్పించుకుని తిరుగుతున్న జగదీశ్‌ను పోలీసులు బుధవారం (డిసెంబర్ 6) అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సూసైడ్ చేసుకున్న మహిళతో గతంలో జగదీశ్‌కు పరిచయం ఉందని పోలీసులు పేర్కొన్నారు. జగదీశ్ విషయానికి వస్తే మొదట కొన్ని షార్ట్ ఫిల్మ్స్‌లో నటంచాడు. ఆ తర్వాత 2019 మల్లేశం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. జార్జ్ రెడ్డి, పలాస 1978 సినిమాల్లో కీ రోల్స్ పోషించాడు. అయితే పుష్ప సినిమాతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. అందులో అల్లు అర్జున్ నమ్మిన బంటుగా కేశవ పాత్రలో తనదైన యాస్, యాక్టింగ్‌తో అదరగొట్టాడు జగదీశ్. దీని తర్వాత పిక్ పాకెట్, విరాట పర్వం, బుట్ట బొమ్మ సినిమాల్లో వివిధ పాత్రల్లో మెరిశాడు. ఇక సత్తి గాని రెండెకరాలు సినిమాతో హీరోగానూ అదృష్టం పరీక్షించుకున్నాడు. పుష్ప 2లో జగదీశ్ రోల్ మరింత పవర్ ఫుల్ గా ఉండనుందని ప్రచారం జరుగుతోంది. మరి ఇంతలోనే అతను ఇలా చిక్కుల్లో పడ్డాడు.🚨🔍