బాలీవుడ్ స్టార్ నటుడు రణబీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తాజా మైథలాజికల్ సినిమా రామాయణ. ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఈ మూవీని నితీష్ తివారీ డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, హనుమాన్ గా సన్నీ డియోల్, రావణాసురుడిగా యష్ నటించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ మూవీని నమిత్ మల్హోత్రా తో కలిసి యష్ కూడా నిర్మిస్తున్నారు.
ఇక తాజాగా ఈ మూవీ గురించి వారిద్దరూ మాట్లాడుతూ, ఇందులో మేము ఎటువంటి ప్రయోగాలు చేయడం లేదు, మా చిత్రం రామాయణ ఇతిహాసానికి నిజాయితీగా నమ్మకమైన అనుకరణగా ఉంటుందని యష్, నమిత్ చెప్పారు. రామాయణం మనకు బాగా తెలుసు అని అనుకుంటాం. అయినా ప్రతిసారీ ఏదో ఓ కొత్త జ్ఞానాన్ని అందించడంతోపాటు ప్రత్యేకమైన దృక్పథాలను పరిచయం చేస్తుంది. ఈ కాలాతీతమైన ఇతిహాసాన్ని సిల్వర్ స్క్రీన్ పైకి తీసుకురావడమే మా లక్ష్యం. ఇదో గొప్ప అద్భుతంగా ఉండనుంది. అదే సమయంలో ఆ కథ, అందులోని భావోద్వేగాలు, విలువలను చెప్పడంలో మాత్రం అంతే నిజాయతీగా ఉంటాం. రామాయణాన్ని ప్రపంచంతో పంచుకోవడానికి సాగే ప్రయాణమిదని యశ్ అన్నారు. రామాయణం ఎప్పుడూ తనలో ప్రతిధ్వనిస్తూనే ఉంటుందని, ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి అది కూడా కారణమని ఆయన తెలిపారు. నిజానికి ఈ మూవీ యొక్క అధికారిక ప్రకటన అయితే వెలువడాల్సి ఉండగా ఇప్పటికే మూవీ యొక్క షూటింగ్ ప్రారంభం అయింది. త్వరలో దీనికి సంబంధించి అన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. ఇక ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ తో పాటు హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హన్స్ జిమ్మర్ కూడా పని చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి శ్రీరామనవమి నాడు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.