బాలీవుడ్ నటి నూర్ మాలబికా దాస్ (37) అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ముంబైలోని ఆమె ఫ్లాట్‌లో శవమై కనిపించారు. ఇరుగు పొరుగు దుర్వాసనను గమనించి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా ఆమె మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉంది. పోలీసులు ఇది సూసైడ్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు, కానీ సూసైడ్ నోట్ లభించలేదు.
నూర్ మాలబికా దాస్ అస్సాంలో జన్మించి ఖతార్ ఎయిర్‌వేస్‌లో ఎయిర్ హోస్టెస్‌గా పని చేసి, తర్వాత సినిమాలపై ఆసక్తితో ముంబైకి వచ్చి, లోఖండ్‌వాలాలోని ఫ్లాట్‌లో నివసిస్తున్నారు.
పోలీసులు విచారణలో భాగంగా ఆమె ఫ్లాట్ నుంచి మందులు, మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. నూర్ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా, వారు ఇటీవలే ముంబయి వెళ్లి వచ్చామని, మళ్లీ రాలేమంటూ చెప్పారు. స్నేహితుడు, నటుడు అలోక్‌నాథ్ పాఠక్ ఓ ఎన్‌జీవో సాయంతో అంత్యక్రియలు నిర్వహించారు.
2023 లో ‘ది ట్రయల్’ వెబ్ సిరీస్‌లో కాజోల్‌కు సహనటిగా నటించిన నూర్, పలు వెబ్ షోల్లో నటించారు. ఆమె మృతిపై సమగ్ర విచారణ జరపాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే, హోం మంత్రి దేవేంద్ర ఫడణవీస్‌లను ‘ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్’ కోరింది.