ప్రకాష్ రాజ్ కన్నడ నటుడు, తమిళంలో మొదటి సినిమా కె బాలచందర్ దర్శకత్వంలో నటించారు. అయితే తమిళం, కన్నడ, మలయాళం, హిందీ ఇలా అన్ని భాషల్లో నటుడుగా చేసినా, తెలుగులో ఎక్కువ సినిమాలు చేసిన నటుడు ప్రకాష్ రాజ్. తెలుగులో హైయెస్ట్ పైడ్ క్యారెక్టర్ నటుడిగా ప్రకాష్ రాజ్ కి పేరుంది.
అలాగే ప్రకాష్ రాజ్ కి తెలుగు దర్శకులు, నిర్మాతలు ఇచ్చినన్ని పాత్రలు, గౌరవం మరే పరిశ్రమ ఇవ్వలేదనే చెప్పాలి. అందుకే హైదాబారాబాదులోనే నివాసం ఏర్పరచుకొని ఇక్కడే వుంటారు. చాల ప్రాంతాలతో పాటుగా ఇక్కడ హైదరాబాదులో కూడా ఫార్మ్ హౌస్, ఇల్లు అన్నీ కట్టుకొని స్థిరపడ్డారు అనే చెప్పాలి. కానీ ఎందుకో అతనికి తెలుగు మీడియా అన్నా, తెలుగు ప్రేక్షకులు అన్నా ఒకింత చిరాకుగా ఉంటుంది.
అందుకే తెలుగులో ప్రకాష్ రాజ్ పై వచ్చినన్ని వివాదాలు మరే పరిశ్రమలో అతనిపై రావని అంటారు. తెలుగు మీడియాపై ఎన్నోసార్లు విమర్శలు చేస్తూ వివాదాల్లో వున్నారు. అలాగే షూటింగ్స్ కి లేట్ గా వస్తారని పరిశ్రమలో అంటూ వుంటారు, ఆలా చాలామంది దర్శకులని ఏడిపించారు అని కూడా అన్నారు. ఒకరిద్దరు దర్శకులు ప్రకాష్ రాజ్ ని తీసుకున్నా, అతను లేట్ గా రావటం చూసి, అతన్ని తీసేసి వేరే నటులను పెట్టుకున్న సందర్భాలు కూడా వున్నాయి.
నిన్న ధనుష్ కథానాయకుడిగా నటించిన 'రాయన్' సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఒకింత అసహనానికి గురయ్యారు ప్రకాష్ రాజ్. ధనుష్ 50వ సినిమా ఇది, అలాగే ధనుష్ దర్శకుడిగా కూడా ఈ సినిమాకి పని చేశారు. వచ్చిన ప్రేక్షకులు అరుపులతో అందరికీ స్వాగతం చెప్పినట్టే ప్రకాష్ రాజ్ కి కూడా చెపితే, ఆ అరుపులకి ప్రకాష్ రాజ్ కొంచెం కోపగించుకోవడం కనిపించింది. 'అరుపులు ఆపండ్రా' అని ప్రేక్షకులను ఉద్దేశించి అన్నారు. మధ్యలో ప్రేక్షకులు అరుపులు మళ్ళీ వినపడితే, 'రెండు నిముషాల ఆగుతావా, కొంచెం భాద్యతగా మాట్లాడుకుందాం... ' అని అసహనం వ్యక్తం చేశారు ప్రకాష్ రాజ్.
తరువాత ధనుష్ గురించి, ధనుష్ గొప్పతనం గురించి, అతను అందరికీ ఎలా స్ఫూర్తి అవుతాడు అవన్నీ వివరించారు. అయితే పరిశ్రమలో ప్రకాష్ రాజ్ విషయమే చర్చ జరుగుతోంది. ప్రకాష్ రాజ్ తెలుగు ప్రేక్షకులపై అసహనం వ్యక్తం చేసినట్టు, చెన్నై లోనో, బెంగుళూరులోనే చెయ్యగలరా? అని పరిశ్రమలో ఒక నిర్మాత అన్నారు. తెలుగు ప్రేక్షకులు, దర్శకులు, నిర్మాతలు తెలుగు నటులనే కాకుండా, చాలామంది ఇతర భాషా నటుల్ని కూడా అందలం ఎక్కించారు, అగ్రస్థానంలో నిలిపారు. అటువంటివారిలో ప్రకాష్ రాజ్ ఒకరు, మరి అలాంటి ప్రకాష్ రాజ్ తెలుగు ప్రేక్షకులపై ఎందుకు అంతలా మండిపడుతున్నారో? అర్థం కాదు అని పరిశ్రమలో ఒక టాక్ నడుస్తోంది. ప్రకాష్ రాజ్ గొప్ప నటుడు, ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు, కానీ కాస్తా కోపం తగ్గించుకుంటే బాగుంటుందేమో అని కూడా అంటున్నారు.