ఈనెల 29వ తేదీ నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమవుతుంది. అయితే రియాసిలో కొద్దిరోజుల క్రితం టూరిస్టుల బస్సును ఉగ్రవాదులు టార్గెట్ చేయడంతో ఈసారి భద్రతను రెట్టింపు చేస్తున్నారు. జమ్ము లోని భగవతి నగర్‌లో ఉన్న బేస్ క్యాంప్ దగ్గర మాక్‌డ్రిల్ నిర్వహించారు. జమ్ముకశ్మీర్ పోలీసులతో పాటు ఆర్మీ జవాన్లు ఈ మాక్‌డ్రిల్‌లో పాల్గొన్నారు.
రియాసిలో జరిగిన ఉగ్రదాడిలో 9 మంది టూరిస్టులు చనిపోయారు. గత వారం రోజులుగా జమ్ముకశ్మీర్‌లో వరుస ఉగ్రదాడులు కలకలం రేపుతున్నాయి. జమ్ముకశ్మీర్‌లో శాంతిభద్రతలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అమర్‌నాథ్ యాత్రకు గట్టి భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు.
అమర్‌నాథ్ యాత్ర 45 రోజుల పాటు కొనసాగనుంది. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. జమ్ముకశ్మీర్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ అక్కడ పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.