top of page
Shiva YT

రసవత్తరంగా మారుతోన్న ఆ జిల్లా రాజకీయం.. ట్రయాంగిల్‌ ఫైట్‌ తప్పదా.?

ఎన్టీఆర్‌ జిల్లా మైల‌వ‌రం రాజ‌కీయం.. రోజురోజుకూ ర‌స‌వ‌త్తరంగా మారుతోంది. సైకిల్‌ పార్టీ సీటుకోసం ఇప్పటికే అక్కడ ఇద్దరు నేతల మధ్య ఫైట్‌ నడుస్తుండగా..ఇప్పుడు మూడో కృష్ణుడిరాక మరింత హీట్‌ పుట్టిస్తోంది. మరి ఈ ట్రయాంగిల్‌ ఫైట్‌లో సీటెవరికి..? షాక్‌ ఎవరికి..? అన్న దానిపై ఇప్పుడు జిల్లాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.


ఎన్టీఆర్‌ జిల్లా టీడీపీలో కొత్త పంచాయతీ మొదలైంది. ప్రస్తుతం మైలవరం సీటు విషయంలో దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు మధ్య ఫైటు నడుస్తోంది. తాజాగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా పార్టీలో చేరడం కాన్ఫామ్‌ అయింది. త్వరలోనే ఆయన చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. త‌న‌కు మైల‌వ‌రం సీటు ఇవ్వాల‌ని వ‌సంత కృష్ణ ప్రసాద్ కోరిన‌ట్లు తెలుస్తోంది. దీంతో మైలవరం టికెట్‌ కోసం ముగ్గురు నేతల మధ్య ఫైట్‌ మొదలయింది.

మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రస్తుతం మైలవరంలో టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. మైల‌వ‌రం టికెట్‌ తనదేనని చెబుతున్న దేవినేని.. త్వరలో ప్రచారం ప్రారంభించడానికి కూడా సన్నాహాలు చేసుకుంటున్నారు. మరోవైపు వ‌సంత కృష్ణ ప్రసాద్ కంటే ముందు నుంచే ఈ సీటుపై క‌ర్చీఫ్ వేసి ఉంచారు మ‌రో సీనియ‌ర్ నేత బొమ్మసాని సుబ్బారావు. దేవినేని ఉమాకు బ‌దులు త‌న‌కు టిక్కెట్ ఇవ్వాలంటున్నారు. నియోజకవర్గ ప్రజల్లో తనకు మంచి గుర్తింపు ఉందంటున్న బొమ్మసాని.. ఇప్పటికే చంద్రబాబు, లోకేష్‌లను కలిసి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీంతో ఇప్పటికే దేవినేని, బొమ్మసాని మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇప్పుడు వీరికి తోడు వసంత కృష్ణప్రసాద్‌ కూడా తోడవడంతో సీటు పంచాయితీ హీటెక్కింది.

మైలవరంతో పాటు పెనమలూరులో కూడా వసంత కృష్ణ ప్రసాద్‌పై సర్వేలు చేయిస్తోంది.. టీడీపీ అధిష్టానం. అలాగే మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్, బొమ్మసాని సుబ్బారావుపై ప్రజల అభిప్రాయాలను తీసుకుంటున్నారు. మైలవరంలో టీడీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని..కానీ అభ్యర్థి ఎంపిక కూడా ముఖ్యమని సర్వేల్లో తేలినట్టు తెలుస్తోంది. దీంతో చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది. మొత్తానికి ఒకే చోట ముగ్గురు అభ్యర్థులు టికెట్‌ రేసులో ఉండటం..సైకిల్‌ పార్టీకి సమస్యలు తెచ్చిపెట్టేటట్టు కనిపిస్తోంది.

bottom of page