కూటమి పార్టీల ప్రచారం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. జనసేన-టీడీపీ-బీజేపీ సంయుక్తంగా ఈ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు. ఉభయ గోదావరిజిల్లాల్లో చేపట్టిన ప్రజాగళం.. ఉమ్మడి సభలకు భారీ ఎత్తున స్పందన వచ్చిన నేపథ్యంలో ఈ ఊపును రాష్ట్ర వ్యాప్తంగా తీసుకువెళ్లాలని నిర్ణయించారు. తాజాగా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో భేటీ అయిన.. మూడు పార్టీల నాయకులు.. ప్రధానంగా ప్రచారంపైనే దృష్టి పెట్టారు.
ఈ నెల మిగిలిన 15 రోజులు ఎవరికివారుగా ప్రచారం చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించే అవకా శం లేకపోయినా.. వారి వారి నియోజకవర్గాల్లో అయినా ప్రచారం చేసుకునేలా ప్లాన్ సిద్ధం చేసుకోవాలని నిర్ణయించారు. అయితే.. మే 1న పింఛన్ల పంపిణీపై సర్కారుపై ఒత్తిడి తీసుకువచ్చి.. ఈ దఫా ఎలాంటి ఇబ్బందులూ రాకుండా.. లబ్ధి దారులకు ఇళ్ల వద్దే పింఛన్లను పంపిణీ చేయించాలని.. దీనిపై ముందుగానే కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖలు రాయాలని కూడా తీర్మానం చేశారు.
ఇక, మే 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మాత్రం.. మూడు పార్టీలు ఉమ్మడిగానే సభలు, సమావేశాలు.. రోడ్‌షోలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ విషయంలో ఎలాంటి మార్పూ ఉండబోదని కూడా పేర్కొన్నారు. కేంద్రం నుంచి వచ్చే ప్రధాన మంత్రి మోడీ, అమిత్ షా వంటివారి సభలకు కూడా మూడు పార్టీల నాయకులు హాజరు కావాలని నిర్ణయించారు. తద్వారా.. రాష్ట్రంలో బూమ్ తీసుకురావడం ద్వారా.. ఎన్నికల వ్యూహాన్ని బలోపేతం చేసేలా కార్యాచరణ రూపొందించాలని మూడు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చాయి.
ఆ పది రోజుల పాటు ఉమ్మడిప్రచారం అత్యంత కీలకమని.. ఎన్నికల స్ట్రాటజీని మార్చేది.. ఆ పది రోజులే నని నాయకులు ప్రత్యేకంగా భావిస్తున్నారు. దీంతో చివరి పదిరోజులు అందరూ అందుబాటులో ఉండడంతోపాటు.. క్షేత్రస్థాయిలో పర్యటనలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు. ఇదేసమయంలో ఎండల తీవ్రత కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలోఉదయం పూట.. ఆన్‌లైన్ ప్రచారం.. సాయం త్రం 3 గంటల నుంచిఉమ్మడి ప్రచారం చేసుకునేలా ప్లాన్ చేశారు. మొత్తంగా వచ్చే మే 2 నుంచి 11 వరకు ఉమ్మడి సభలతో ఎన్నికల ప్రచారాన్ని ఓ రేంజ్‌కు చేర్చాలని నిర్ణయించారు. కాగా, మే 13న రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి.🗳️✨