తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కొత్త ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ (ఈవో)గా జే. శ్యామలరావును ఏపీ ప్రభుత్వం నియమించింది. శుక్రవారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 1997 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి శ్యామలరావు, గతంలో వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా ఉన్నప్పుడు, జీఎస్టీ అమల్లో సాంకేతిక సమస్యలు రాకుండా చూసుకోవడంతోపాటు, రాష్ట్రానికి ఆదాయం పెరిగేలా పనిచేశారు. ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయన, నిజాయితీ కలిగిన అధికారిగా ప్రసిద్ధి చెందారు. అటువంటి అధికారిని టీటీడీ ఈవోగా నియమించడం మంచిదని ప్రభుత్వం భావించింది.
ఈ నియామకంతో ఇంతవరకు టీటీడీ ఇన్‌చార్జి ఈవోగా ఉన్న ధర్మారెడ్డి పూర్తిగా రిలీవ్ అయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్దిరోజులకే ఆయన సెలవుపై వెళ్లారు. 2022 మేలో టీటీడీ అప్పటి ఈవో జవహర్ రెడ్డి బదిలీ కావడంతో ధర్మారెడ్డికే ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు. కానీ, గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో ఆయన్ను ఈవో బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి, క్యూలైన్లు వెలుపల వరకు ఉన్నాయి. టోకెన్లు లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. శుక్రవారం 66,782 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని, హుండీ ఆదాయం ₹3.71 కోట్లు పొందింది.