కాసేపట్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్లు, 25 లోక్‌సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే ఏపీలో ఏ నియోజకవర్గం ఫలితం ముందుగా వస్తుంది?.. ఆఖరుగా ఏ నియోజకవర్గం ఫలితాలు వస్తాయి?.. అనే అంశాలపై జనంలో చర్చ జోరుగా సాగుతోంది.
తొలి ఫలితం ఏ నియోజకవర్గం.. చివరిగా ఏ నియోకవర్గాల ఫలితాలు వస్తాయని అందరిలో ఉత్కంఠ రేపుతోంది. ఏపీలో అన్నింటికంటే ముందు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గాల తుది ఫలితాలు మధ్యాహ్నంలోపే ప్రకటించే అవకాశముందని ఎన్నికల సంఘ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో కేవలం 13 రౌండ్లలోనే లెక్కింపు పూర్తికానుంది. ఇక రంపచోడవరం, చంద్రగిరి నియోజకవర్గాల్లో అత్యధికంగా 29 రౌండ్ల లెక్కింపు జరుగుతుంది. ఆ తర్వాత పాణ్యం, భీమిలి నియోజకవర్గాల్లో 25 రౌండ్ల లెక్కింపు జరుగుతుంది. ఈ రెండు నియోజకవర్గాల్లో తుది ఫలితాల వెల్లడికి రాత్రి 7 గంటల వరకు వేచిచూడాల్సి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
కాకినాడ జిల్లాకు సంబంధించి ఒక ఎంపీ స్థానం, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ తొలి ఫలితం జగ్గంపేట కానుంది. తర్వాత పెద్దాపురం, ప్రత్తిపాడు..చివరిగా కాకినాడ నగరం, గ్రామీణ నియోజకవర్గాలవి వస్తాయి. సాయంత్రం 6 గంటలలోపు కాకినాడ గ్రామీణం ఫలితం వెల్లడి చేయనున్నట్లు అంచనాకు వచ్చారు. పోస్టల్ బ్యాలట్ ఫలితాల్లో తొలుత జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం, ప్రత్తిపాడు వెల్లడైయ్యే అవకాశం ఉంది. చివరిగా కాకినాడ లోక్‌సభ సర్వీసు, పోస్టల్ ఓట్ల లెక్కింపుపై స్పష్టత వస్తుంది. పోస్టల్ బ్యాలట్ ఫలితాలు మధ్యాహ్నం 2 గంటల్లోపు.. ఈవీఎం ఫలితాలపై సాయంత్రం 6లోపు స్పష్టత రానుంది.
మొత్తం 175 అసెంబ్లీ సెగ్మెంట్లలో 111చోట్ల 20 రౌండ్ల లోపు కౌంటింగ్ ఉంటుంది. 61 నియోజకవర్గాల్లో 21 నుంచి 24 రౌండ్లు, మిగితా మూడు చోట్ల 25 రౌండ్లకుపైగా కౌంటింగ్ కొనసాగేలా ఏర్పాట్లు చేశారు. 111 నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 2గంటల లోపు, 61 నియోజకవర్గాల్లో సాయంత్రం 4లోపు, మరో 3 నియోజకవర్గాల్లో సాయంత్రం ఆరింటిలోపు ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. మరోవైపు కుప్పం, పులివెందుల, పిఠాపురం నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలు మధ్యాహ్నానికి వెల్లడైయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో తొలి ఫలితం రాజోలు నియోజకవర్గమే. చివరిగా ముమ్మిడివరం, రామచంద్రపురం నియోజకవర్గాలవి వెలువడనున్నట్లు చెబుతున్నారు. లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పోస్టల్ బ్యాలెట్లపై మధ్యాహ్నంలోగా స్పష్టత వచ్చేస్తుంది.
ఎటువంటి గందరగోళం లేకుండా అందరి అనుమతితోనే సువిధ యాప్‌లో అప్‌లోడ్ చేసిన తర్వాతే ఫలితాలను ప్రకటించనున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫారం–21సీ, 21ఈలను అదేరోజు ఫ్లైట్‌లో కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాల్సి ఉంటుంది.