ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓట్ల లెక్కింపు, ఫలితాలకు మరో మూడు వారాల సమయం ఉంది. ఇలాంటి సమయంలో వైసీపీ ఆపద్ధర్మ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. దీంతో వాటిని అడ్డుకునేందుకు విపక్షాలు గవర్నర్ ను ఆశ్రయించాల్సిన పరిస్ధితి. ఇప్పటికే కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను గవర్నర్ సాయంతో అడ్డుకున్న విపక్షాలు.. ఇప్పుడు ఈ-ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ డేషన్ కోసం చేస్తున్న ప్రయత్నాలను సైతం అడ్డుకోవాలని ఆయన్ను కోరాయి. ఈ నెల 17నుంచి 25 వరకు అప్ గ్రేడ్ పేరుతో ఈ ఆఫీస్ మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ ఈ -ఆఫీస్ అప్ గ్రేడ్ వ్యవహారం నిలిపివేయాలని గవర్నర్ కు రాసిన లేఖలో కోరారు. ఇంత హడావిడిగా ఈ-ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ డేషన్ కోసం జరుగుతున్న ప్రయత్నాలపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మరికొద్ది రోజుల్లో కొత్త ప్రభుత్వం వస్తున్న తరుణంలో ఇప్పటికిప్పుడు ఈ ఆఫీస్ అప్ గ్రేడియేషన్ అవసరం లేదని తెలిపారు.
పారదర్శకత పాటించని ఈ ప్రభుత్వంలో ఈ-ఆఫీస్ వ్యవహారంలో అక్రమాలు జరిగే అవకాశం ఉందని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వం షెడ్యూల్ చేసిన ఈ-ఆఫీస్ వెర్షన్ అప్ గ్రేడ్ వల్ల సీఎంవో, చీఫ్ సెక్రటరీ, ప్రభుత్వ విభాగాల సేవలకు సంబంధించి ఈ ఆఫీస్ ఈ నెల 17 నుండి 25 వరకు అందుబాటులో ఉండడం లేదని, అత్యవసరంగా ఇప్పుడు చేపట్టిన ఈ ప్రక్రియపై అధికారులు, రాజకీయ పార్టీల్లో అనుమానాలు ఉన్నాయన్నారు. గత 5 ఏళ్లలో ప్రభుత్వం తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలకు సంబంధించిన జీవోలను కూడా ప్రభుత్వం వెబ్ సైట్ లో పెట్టడకుండా రహస్యంగా ఉంచుతోందని, అడ్డగోలుగా విడుదల చేసిన జీవోలను, ప్రభుత్వ పారదర్శకతను ప్రశ్నించిన వారిపై ప్రభుత్వం దాడి చేసిందని లేఖలో చంద్రబాబు ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న ఈ సమయంలో ఈ-ఆఫీస్ వెర్షన్ మార్పు కోసం నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. 17వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఈ ఆఫీస్ మూసివేత, అప్ గ్రేడ్ ప్రక్రియను కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టేదాకా నిలిపివేయాలని సీఎస్ ను ఆదేశించాలని కోరారు.
ఇప్పటికే పలు కీలకమైన రికార్డులు మాయమైనట్లు తెలిసిందని చంద్రబాబు గవర్నర్ కు తెలిపారు. కొద్దిరోజుల క్రితం నిబంధనలకు విరుద్ధంగా పలు రికార్డులను సీఐడీ కూడా అనుమతి లేకుండా కాల్చేసిందన్నారు. ప్రభుత్వ రికార్డుల మాయం, కాల్చివేతపై సీఈఓకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈ నేపథ్యంలో అన్ని ఫైల్‌లు, నోట్ ఫైల్‌లు, రికార్డ్‌లు మాయంకాకుండా భద్రపరచాలన్నారు. అలాగే అన్ని హెచ్ఓడీలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే సీసీ కెమెరాలు ఉన్న చోట పరిశీలన జరపాలన్నారు.