top of page
MediaFx

క్షమాపణలు చెప్పిన ఏపీ మంత్రి నారా లోకేశ్‌..


ఆంధ్రప్రదేశ్‌ మంత్రి, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ క్షమించండి అంటూ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో చోటుచేసుకున్న అనుకోకుండా జరిగిన సంఘటనపై ఆయన క్షమాపణలు కోరారు. చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామంపై ఆయన సీపీఐ (ఎం) పార్టీకి క్షమాపణలు చెప్పారు. గత ప్రభుత్వంలో వ్యవహరించినట్టు పోలీసులు ఇంకా వ్యవహరిస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా పరోక్షంగా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై విమర్శలు చేశారు. ఏం జరిగింది? ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌ పంపిణీ సందర్భంగా చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో పర్యటించారు. మడకశిర నియోజకవర్గం గుండమల గ్రామంలో పర్యటిస్తున్న సందర్భంగా పోలీసులు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా సీపీఐ (ఎం) నాయకులను అదుపులోకి తీసుకున్నారు. గృహ నిర్బంధం, ముందస్తు అరెస్ట్‌లు జరగడంపై సీపీఐ (ఎం) పార్టీ ఖండించింది. ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వంపై కమ్యూనిస్టు పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ వ్యవహారంపై నారా లోకేశ్ 'ఎక్స్‌' వేదికగా స్పందించారు. క్షమించాలి కామ్రేడ్' మమ్మల్ని మన్నించండి కామ్రేడ్. సీఎం చంద్రబాబు  మడకశిర నియోజకవర్గం పర్యటన సందర్భంగా ఆ ప్రాంత సీపీఎం నాయకులను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన పట్ల మన్నించాల్సిందిగా కోరుతున్నాం. గృహ నిర్బంధాలు, ముందస్తు అరెస్టులకు మా కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకం. గత ఐదేళ్ల పరదాల ప్రభుత్వం పోయినా ఇంకా కొంత మంది పోలీసుల తీరు మారలేదు. ఇటువంటి అప్రజాస్వామిక అరెస్టులను పునరావృతం కానివ్వం. ప్రభుత్వాన్ని ప్రజాపక్షమై ప్రశ్నించే హక్కు, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కులను కాపాడతాం. ఇకపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధాలు లాంటి ఘటనలు పునరావృతం కాకుండా  చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖ ముఖ్య అధికారులను కోరుతున్నా' అని నారా లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.

జోరుగా పింఛన్ల పంపిణీ ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ విజయవంతంగా కొనసాగుతోంది. 1వ తేదీనే వంద శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికార యంత్రాంగం ఉదయం నుంచే పంపిణీని ప్రారంభించింది. పింఛన్ల పంపిణీలో భాగంగా సీఎం చంద్రబాబు మడకశిర నియోజకవర్గంలోని గుండమల గ్రామంలో పర్యటించి నేరుగా లబ్ధిదారులకు పింఛన్‌ నగదు అందించారు. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

bottom of page