ఐఫోన్ ప్రియులకు కీలక అప్‌డేట్ వచ్చింది. నెక్స్ట్ జనరేషన్ ఆపరేటింగ్ సిస్టమ్ ‘ఐవోఎస్ 18’ని యాపిల్ కంపెనీ ఆవిష్కరించింది. సోమవారం జరిగిన కంపెనీ ‘వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024’లో దీనిని విడుదల చేసింది. ఈ కొత్త ఐవోఎస్‌లో పలు ఆకర్షణీయమైన నూతన ఫీచర్లు ఉన్నాయి. హోమ్ స్క్రీన్ కస్టమైజేషన్, కంట్రోల్ సెంటర్ రీవాంప్, మెసేజుల యాప్‌కి అప్‌డేట్స్, ట్యాప్ టు క్యాష్‌తో పాటు ఇతర ఫీచర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
ఐవోఎస్ 18 ద్వారా యాపిల్ కొన్ని అదిరిపోయే ఫీచర్లు అందించింది. థీమింగ్స్ ఆప్షన్ల ద్వారా యాప్ ఐకాన్‌లను హోం స్క్రీన్‌పై నచ్చిన విధంగా మార్చుకోవచ్చు. డార్క్ మోడ్‌లో యూజర్లు తమకు నచ్చిన విధంగా యాప్‌లను మార్చుకోవచ్చు.
ఇక మల్టీపుల్ లేఅవుట్లు చేసుకునేందుకు వీలుగా కంట్రోల్ సెంటర్ ఫీచర్ అప్‌డేట్‌ను యాపిల్ అందించింది. కంట్రోల్ సెంటర్‌కు అవసరమైన విభిన్న లేఅవుట్ విడ్జెట్ల కోసం థర్డ్ పార్టీ డెవలపర్స్ అనుమతి కూడా ఉంటుంది. ఇక ఫ్లాష్‌లైట్, కెమెరా ఐకాన్లను లాక్ స్క్రీన్‌పైకి తీసుకోవచ్చు.
ఐవోఎస్ 18పై మరో ముఖ్యమైన ఫీచర్ ఏంటంటే.. పర్సనల్ యాప్‌లను ఫేస్ ఐడీతో లాక్ చేసుకోవచ్చు. మెసేజెస్ యాప్‌లో ఏదైనా ఒక ఎమోజీ లేదా స్టిక్కర్‌ను తిరిగి ట్యాప్ చేసుకునేలా ట్యాప్‌బ్యాక్‌లను రీడిజైన్ చేసింది. అంతేకాదు మెసేజులను షెడ్యూల్ చేసి పంపించవచ్చు. అండర్‌లైన్ వంటి టెక్స్ట్ ఎఫెక్ట్‌లు, ఫార్మాటింగ్ ఆప్షన్లు కూడా కొత్త ఐవోఎస్‌లో ఉన్నాయి.
మరిన్ని ఫీచర్ల విషయానికి వస్తే ఐఫోన్ 14, ఐఫోన్ 15 యూజర్లు వైఫై లేదా సెల్ సర్వీసు లేకుండానే ఐమెసేజులను పంపించుకోవచ్చు. శాటిలైట్ ద్వారా ఈ లేటెస్ట్ సేవను పొందవచ్చు. ఇక మెయిల్ యాప్ ఆటోమేటిక్‌గా కేటగిరి అయి ఉంటుంది. దీంతో పాటు యాపిల్ మ్యాప్స్‌ను ఆఫ్‌లైన్‌లో కూడా ఉపయోగించవచ్చు. ఈ మేరకు టోపోగ్రాఫిక్ మ్యాప్‌లను ఐవోఎస్ 18 జోడించింది. యాపిల్ వాలెట్ అయిన యాపిల్ క్యాష్ కోసం ట్యాప్-టు-పే ఫీచర్‌ను కంపెనీ అందించింది. ఈ ప్లాట్‌ఫామ్‌పై పేమెంట్లు చేయడమే కాకుండా ఈవెంట్ టిక్కెట్‌లకు మరింత సులువుగా బుక్ చేసుకోవచ్చు. గేమ్ మోడ్, క్యాలెండర్‌లో రిమైండర్స్ ఇంటిగ్రేషన్‌తో పాటు పలు ఫీచర్లను అందించింది.