ఆపిల్ సంస్థ తయారు చేసే ఐఫోన్లకు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది. లేటెస్ట్ ఫీచర్లు, ఆకట్టుకునే టెక్నాలజీతో ఇవి దూసుకుపోతున్నాయి. ఆపిల్ ఐఫోన్ల కొత్త మోడళ్ల విడుదల కోసం ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇంత ఆదరణ పొందిన ఐఫోన్లను మన్నిక పెంచడానికి ఆపిల్ కంపెనీ నిరంతరం అనేక చర్యలు తీసుకుంటుంది. ఇటీవల అలస్కా ఎయిర్‌లైన్స్ బోయింగ్ జెట్ నుంచి లేటెస్ట్ సిరీస్ ఐఫోన్ కింద పడింది. దాదాపు 16 వేల అడుగుల నుంచి భూమి మీద పడినా పనిచేయడం దాని మన్నికకు నిదర్శనం.
ఆపిల్ తన ఐఫోన్ల మన్నికకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుంది. దీర్ఘకాలం పనిచేసేలా చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా టైటానియం బిల్డ్‌ను పరిచయం చేసింది. షిప్పింగ్ ముందు అన్ని ఉత్పత్తులను కఠినమైన పరిస్థితులలో పరీక్షిస్తారు. ఇటీవల 10,000 ఐఫోన్లను పరీక్షించారు. ఆపిల్ ల్యాబ్‌లను సందర్శించిన కొందరు వారు పరీక్షలు ఎలా నిర్వహిస్తారో చూశారు. ఈ వీడియోలను సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ఆపిల్ తన ఐఫోన్ల మన్నిక కోసం అనేక పద్ధతులు పాటిస్తుంది. వాటిలో డ్రిప్ రెయిన్ సిమ్యులేషన్, తక్కువ ప్రెజర్ హీట్ ఎక్స్‌పోజర్, రోబోట్‌లను ఉపయోగించడం వంటి పరీక్షలు ఉన్నాయి. ఆపిల్ హార్డ్ వేర్ ఇంజినీరింగ్ హెడ్ జాన్ టెర్నస్ మాట్లాడుతూ ఫోన్ల మన్నికకు తమ సంస్థ అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా డెలివరీ చేసే ముందు 10,000 ఫోన్లను పరీక్షించామన్నారు. మన్నిక పెరగడం వల్ల ఫోన్లను మరమ్మతు చేయడం సవాలుగా మారిందన్నారు.
ఐఫోన్లు నీటి నిరోధక డిజైన్ కలిగి ఉన్నాయి. ఇది ఫోన్ నీటిలో పడినా పాడవ్వకుండా చేస్తుంది. అధిక గ్రేడ్ అడెసివ్‌లు, ఇతర సాంకేతికతను ఉపయోగించి ఈ విధంగా రూపొందిస్తారు. అయితే, ఫోన్ మరమ్మతుల కోసం ఓపెన్ చేయడం కష్టమవుతుంది. ఐఫోన్ 15 సిరీస్‌లో గ్లాస్ బ్యాక్, ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఎన్‌క్లోజర్‌ను పరిచయం చేసింది.
ఇటీవల అనేక ప్రమాదాల నుంచి ఐఫోన్లు బయటపడ్డాయి. వినియోగదారులు ఈ విషయాన్ని తెలియజేశారు. గత నెలలో ఒక ఐఫోన్ అలాస్కా ఎయిర్‌లైన్స్ బోయింగ్ జెట్ నుంచి 16 వేల అడుగుల ఎత్తు నుంచి కిందపడింది. కొన్ని రోజుల తర్వాత అది పనిచేస్తూ ఉండడం గమనార్హం.