ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు చోటుచేసుకున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్డీయే కూటమి ప్రభంజనం కొనసాగింది. ఏపీ ఫలితాలు వైసీపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయి. మంత్రలు అందరూ ఓటమి పాలైయారు. 175 సీట్లకు గాను కేవలం 10 స్థానాలతో సరిపెట్టుకుంది వైసీపీ. ఇంత ఘోరమైన ఓటమి నేపథ్యంలో వైఎస జగన్మోహన్ రెడ్డి స్పందించారు.
ఏపీ ఎన్నికల ఫలితాలు ఆశ్చరం కలుగించాయన్నారు. ఫలితాలు ఇలా వస్తాయని ఊహించలేదన్నారు. అమ్మఒడి, 53 లక్షల మంది తల్లులకు, రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలని అడుగులే వేశామన్నారు. అక్కాచెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో అర్థం కావడం లేదన్నారు. అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులకు గతంలో ఎన్నడూ జరగని విధంగా మేలు చేశామన్న జగన్, వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ.. వారి ఇంటికి పంపే వ్యవస్థను కూడా తీసుకువచ్చామన్నారు.
రాష్ట్ర ప్రజల కష్టాలనే మా కష్టాలుగా భావిస్తూ.. ఇచ్చిన ఏ మాట తప్పకుండా అన్ని రకాలుగా వారికి అండగా ఉన్నామని జగన్ తెలిపారు. చేయూతతో ప్రతి ఒక్కరికి భరోసా కల్పించామన్న జగన్, వారి ప్రేమాభిమానాలు ఏమాయ్యాయోనని జగన్ ప్రశ్నించారు.
మేనిఫెస్టోలో ప్రకటించిన 99 శాతం హామీలు అమలు చేశామన్న జగన్, సామాజిక న్యాయం చేసి చూపించామన్నారు. కోట్ల మంది ప్రజల అభిమానం ఏమైందో తెలియడం లేదన్నారు. మంచి చేయడానికి ప్రజలకు తోడుగా ఉంటామన్న జగన్, పేదలకు ఎప్పుడూ వైసీపీ అండగా ఉంటుందన్నారు. ఢిల్లీ లెవల్ కూటమి కట్టిన పెద్దలు ఎన్నికల్లో ఏం చేశారో దేవుడికే తెలియాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పవన్‌కల్యాణ్ సహా కూటమి నేతలకు అభినందనలు తెలిపిన జగన్, ప్రతిపక్షంగా ఉండటం కొత్తేమీ కాదన్న ఆయన, ప్రజల పక్షాన పోరాడేందుకు సిద్ధమన్నారు.