తెలంగాణలో ప్రజాసర్కార్ ఏర్పాటు చేస్తామని అన్నారు రాహుల్. రేవంత్ రెడ్డితో ఉన్న ఫొటోలను రాహుల్ తన ట్వీట్ కి జతచేశారు. ఈరోజు ఉదయం నుంచి ఢిల్లీలో రేవంత్ రెడ్డి బిజీబిజీగా ఉన్నారు.
తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి రాహుల్ గాంధీ ఆసక్తికర ట్వీట్ వేశారు. తెలంగాణ కాబోయే సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పారు రాహుల్. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తన ఆరు గ్యారెంటీలు నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు. తెలంగాణలో ప్రజాసర్కార్ ఏర్పాటు చేస్తామని అన్నారు రాహుల్. రేవంత్ రెడ్డితో ఉన్న ఫొటోలను రాహుల్ తన ట్వీట్ కి జతచేశారు. ఈరోజు ఉదయం నుంచి ఢిల్లీలో రేవంత్ రెడ్డి బిజీబిజీగా ఉన్నారు. ఉదయాన్నే ఆయన మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్ ని కలిశారు. అనంతరం సోనియా గాంధీ ఇంటికి వెళ్లారు. అక్కడ సోనియా, రాహుల్, ప్రియాంకను కలసి ధన్యవాదాలు తెలిపారు. తనకు సీఎంగా అవకాశమిచ్చినందుకు అగ్రనేతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు రేవంత్ రెడ్డి. వారి ఆశీర్వాదం తీసుకున్నారు. హైదరాబాద్ లో రేపు జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని వారిని ఆహ్వానించారు.
ఢిల్లీ పర్యటనలోనే తెలంగాణ మంత్రి వర్గంపై కూడా రేవంత్ రెడ్డి మంతనాలు సాగిస్తున్నారు. అధినాయకత్వంతో చర్చలు జరిపి ఆయన తెలంగాణ మంత్రి వర్గం జాబితాపై ఆమోద ముద్ర వేయించుకోబోతున్నారు. రేవంత్ వర్గంతోపాటు.. రేవంత్ ని వ్యతిరేకిస్తున్న సీనియర్ వర్గానికి కూడా మంత్రి వర్గంలో సముచిత స్థానం కల్పించే అవకాశముంది. డిప్యూటీసీఎంల దగ్గరే పీటముడి పడే అవకాశమున్నట్టు తెలుస్తోంది. డిప్యూటీలు ఇద్దరు ఉంటారా, లేక ఒకరితోనే(భట్టి విక్రమార్క) సరిపెడతారా అనేది తేలాల్సి ఉంది. మంత్రి వర్గ జాబితా కూడా ఫైనల్ అయితే రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరతారు. 🗓️🏛️