top of page
MediaFx

వాలంటీర్ల విషయంలో ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ.. వారిపై కేసులు నమోదు..


వాలంటీర్ల విషయంలో ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ.. వారిపై కేసులు నమోదు.. ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల ఎపిసోడ్‌ చర్చనీయాంశంగా మారుతోంది. రాజీనామా చేసిన వాలంటీర్లు అంశంపై కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? ఏపీ రాజకీయం వాలంటీర్ల చుట్టూ తిరుగుతోంది. కొత్త ప్రభుత్వానికి సవాల్‌గా మారుతోంది. ఎన్నికల సమయంలో రాజీనామా చేసిన వాలంటీర్లు.. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుండడంతో హాట్‌టాపిక్‌ అవుతోంది. ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వాలంటీర్లు నిరసనలకు దిగారు. ఇప్పటికే.. నెల్లూరు, నంద్యాల, శ్రీకాకుళం.. ఇలా దాదాపు అన్ని జిల్లాల్లోనూ అధికారులను కలిసి ఫిర్యాదులతోపాటు.. విజ్ఞప్తులు చేశారు వాలంటీర్లు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలను కలిసి మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని వేడుకుంటున్నారు. అంతేకాదు.. కొందరు బెదిరించి రాజీనామాలు చేయించారని ఆరోపిస్తూ.. వారిపై పోలీసులకు ఫిర్యాదులు కూడా చేస్తుండడంతో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లా గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నానితోపాటు.. దుక్కిపాటి శశిభూషణ్, గొర్ల శ్రీను, కఠారి శేషుబాబు, కుర్మారాజు అనే మరికొందరిపైనా వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదు చేశారు. ఇదిలావుంటే.. గతంలో ఎన్ని ఆరోపణలు, విమర్శలు చేసినా.. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలకు వాలంటీర్‌ వ్యవస్థ కీలకంగా మారింది. దాంతో.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్‌ వ్యవస్థను కంటిన్యూ చేస్తామని అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు మిగిలిన కూటమి నేతలు కూడా హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే.. కూటమి సర్కార్‌ వాలంటీర్ సిస్టమ్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తి రేపుతోంది. రాజీనామాలు చేసిన వాలంటీర్లను బాధితులుగా భావించి కొత్త ప్రభుత్వం కనికరిస్తుందా? రోడ్డెక్కి కన్నీళ్లు పెట్టుకుంటున్న నేపథ్యంలో మానవత్వంతో ఆలోచించి.. మళ్లీ విధుల్లోకి తీసుకుంటుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే మరికొన్ని రోజుల వేచిచూడాల్సి ఉంది.

bottom of page