ప్రపంచవ్యాప్త సంగీత ప్రియులు ఎంతగానో ఆరాధించే పాప్ రారాజు మైకేల్ జాక్సన్ ఓ భారతీయ సినిమాలో ఆడిపాడితే ఎలా ఉండేది? ఆ ఊహే అద్భుతం కదా? అందుకోసం ప్రయత్నాలు కూడా జరిగాయి. అయితే మైకేల్ జాక్సన్ అకాల మరణంతో ఆ కల సాకారం కాలేకపోయింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ ఆ ప్రయత్నం చేశారు.
ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ “స్లమ్‌డాగ్ మిలియనీర్’ చిత్రానికి ఆస్కార్ గెలుచుకున్న అనంతరం లాస్‌ఏంజిలస్‌లో మైకేల్ జాక్సన్‌ను కలిశా. ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ మ్యూజిక్ తనకెంతో నచ్చిందని నాతో చెప్పారు. తన పిల్లలను కూడా నాకు పరిచయం చేశారు. ఇండియాకు వచ్చిన తర్వాత మైకేల్ జాక్సన్‌ను కలిసిన విషయాన్ని దర్శకుడు శంకర్‌తో పంచుకున్నా.
అప్పుడు ఆయన ‘ఎంథిరన్’ షూటింగ్‌లో ఉన్నారు. ‘మైకేల్ జాక్సన్‌తో మన సినిమాలో ఓ పాట పాడిస్తే ఎలా ఉంటుందో ఆలోచించు. అది సాధ్యమయ్యే పనేనా?’ అంటూ శంకర్ నాతో అన్నారు. ఆ మరుసటి రోజే నేను మైకేల్ జాక్సన్‌తో ఫోన్‌లో ఈ విషయాన్ని చెప్పాను. ‘మీరు ఏం చెప్పినా నేను చేయడానికి సిద్ధం. మనిద్దరం కలిసి వర్క్ చేద్దాం’ అన్నారు. ఇది జరిగిన కొన్ని నెలలకే మైకేల్ జాక్సన్ మరణించారు. దాంతో మేమిద్దరం చేయాల్సిన తమిళ సాంగ్ ఆగిపోయింది’ అని ఏఆర్ రెహమాన్ చెప్పారు.