top of page
MediaFx

ఆటా, పాట..అంగన్‌వాడీ బాట


బుడిబుడి అడుగులు వేసే చిన్నారులు ఆటలు ఆడుతూ.. పాటలు పాడుతూ.. అక్షరాలు నేర్చుకునేందుకు అంగన్‌వాడీ బాట పడుతున్నారు. దీంతో అంగన్‌వాడీ కేంద్రాలకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ప్రైవేట్‌ స్కూళ్లకు దీటుగా బోధిస్తూ అంగన్‌వాడీ టీచర్లు వారెవ్వా.. అనిపించుకుంటున్నారు. వివిధ ఆట వస్తువులు, చార్టులను తయారు చేసి చిన్నారులకు శ్రద్ధతో విద్యనందిస్తున్నారు. మూడేళ్ల వయస్సు నుంచే చిన్నారులను మురిపిస్తూ.. నూతన విద్యకు శ్రీకారం చుడుతూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల వ్యాప్తంగా మొత్తం 49 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా.. ఇందులో 6 అద్దె భవనాలు, 11 సొంత భవనాలు, 32 ప్రభుత్వశాఖకు అనుసంధానంగా కొనసాగుతున్నట్లు ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ శైలజ తెలిపారు. 2022లో 620 మంది పిల్లలు, 2023లో 660 మంది ప్లిలలు ఉండగా.. ప్రస్తుతం 755 పిల్లల అంగన్‌వాడీ స్టెంటర్లలో సంఖ్య పెరిగింది. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు, అంగన్‌వాడీ టీచర్లు అవగాహన కల్పించడం, తల్లిదండ్రులు సహకరించడంతోనే విజయవంతమవుతున్నామని శైలజ చెప్పారు.

గర్భిణులు, బాలింతలకు అవగాహన

గ్రామాల్లో గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం ఎలా తీసుకోవాలో అంగన్‌వాడీ కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటుచేసి చెబుతున్నారు. పోషక విలువలున్న పౌష్టికాహారాన్ని అందిస్తూ తగు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. కాగా చిన్నారులకు ఎంత చెప్పినా వారు చెప్పిందే వేదం అన్న మాదిరిగా వ్యవహరిస్తుంటారు. కానీ వారికి అర్థమయ్యే రీతిలో ఆటలు, పాటలు, కథలు చెబుతూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. దీంతో అంగన్‌వాడీ కేంద్రాలకు పిల్లలను పంపించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు.

విద్యాబుద్ధులు నేర్పిస్తూ..

ఆట, పాటలు, కథలతో పాటు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాం. ఇటు పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటూ.. అటు అంగన్‌వాడీ కేంద్రాలకు పిల్లలను పంపించేలా అవగాహన కల్పిస్తున్నాం. పిల్లలు, గర్భిణులు, బాలింతలకు ప్రతిరోజూ పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం.

- మీనాక్షి, అంగన్‌వాడీ టీచర్‌, చిన్నచెల్మెడ

పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం

ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో అందించే పౌష్టికాహారాన్ని గర్భిణులు, బాలింతలు తప్పనిసరిగా తీసుకోవాలి. వాటిలో చిరుధాన్యాలతో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. రోజువారీగా పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటే ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.

bottom of page