top of page
MediaFx

రూ.10వేలు UPI చెస్తేనే రక్షిస్తానంటూ గజ ఈతగాడి డిమాండ్‌..


ఉత్తరప్రదేశ్‌లోని ఆరోగ్యశాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆదిత్య వర్థన్‌ సింగ్‌ ఆదివారం బిల్‌హౌర్లోని నానమౌ వద్ద గంగానది ఘాట్‌లో సూర్యుడిని ఆరాధించేందుకు పుణ్యస్నానానికి దిగాడు. గట్టున ఉన్న తన స్నేహితులు ఫొటోలు తీస్తుండటంతో మరికొంత దూరం నదిలోకి వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన వార్నింగ్‌ మార్క్‌ను కూడా దాటేశాడు. ఇంతలో అనుకోకుండా నీటి ప్రవాహం పెరగడంతో నీట మునిగిపోయాడు. అతడికి ఈత బాగానే వచ్చినా ప్రవాహం ధాటికి తట్టుకొలేక నదిలో కొట్టుకుపోయాడు. ఆదిత్య నీటిలో మునిగిపోవడాన్ని గమనించిన ఆయన మిత్రులు అక్కడే ఉన్న ప్రైవేటు గజఈతగాళ్ల వద్దకు వెళ్లి కాపాడాలని కోరారు. వారిలో కాపాడేందుకు గజ ఈతగాడు సునీల్‌ కాశ్యప్‌ ముందుకు వచ్చాడు. అయితే తనకు రూ.10,000 చెల్లిస్తేనే నదిలోకి దిగుతానని మొండికేశాడు. తమ వద్ద అంత నగదు రూపంలో అంత లేదని చెప్పినా వినలేదు. అయితే యూపీఐ ద్వారా చెల్లించాలని చెప్పాడు. దీంతో ఆదిత్య మిత్రుల్లో ఒకరు యూపీఐ ద్వారా చెల్లింపులు చేయడం ప్రారంభించాడు. ఆన్‌లైన్‌లో తనకు బదిలీ అయ్యేవరకు నీళ్లలో దిగబోనని సునీల్‌ కాశ్యప్‌ తెగేసి చెప్పాడు. నగదు బదిలీ అయ్యే వరకు వేచి ఉన్న సునీల్‌ కాశ్యప్‌ తీరా పూర్తయ్యాక.. నీళ్లలో దిగబోయాడు. అప్పటికే ప్రవాహంలో ఆదిత్య గల్లంతైపోయాడు.

గజ ఈతగాడు వెంటనే నదిలోకి దూకి ఉంటే, అధికారిని రక్షించేవారని సింగ్ స్నేహితులు వాపోయారు. కాన్పూర్‌లో నియమించబడిన సింగ్ శనివారం గంగా నది ఒడ్డున ఉన్న నానామౌ ఘాట్‌కు చేరుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. నదిలో స్నానం చేస్తుండగా, బలమైన ప్రవాహానికి సింగ్ జారిపడి కొట్టుకుపోయాడని, ఆయన మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఆదిత్య భార్య మహారాష్ట్రలో న్యాయమూర్తిగా పనిచేస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, ఫ్లడ్‌ యూనిట్‌, పోలీసులు, ప్రైవేటు డైవర్స్‌ కూడా రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు గజ ఈతగాళ్ల డబ్బు డిమాండ్‌ ఆరోపణలపై కూడా విచారణ జరిపి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీపీ సింగ్‌ తెలిపారు.

bottom of page