అయోధ్యలో రామ్‌లల్లా ప్రతిష్ఠాపన పూర్తయినప్పటి నుంచి రామనగరికి భక్తులు పోటెత్తున్నారు. ప్రతిరోజూ ఒకటిన్నర నుంచి రెండు లక్షల మంది భక్తులు బాలరాముణ్ణి దర్శించుకుంటున్నారు.
గడచిన 18 రోజుల్లో దాదాపు 40 లక్షల మంది భక్తులు రామ్‌లల్లాను దర్శించుకుని పూజలు చేశారు. భక్తుల రద్దీ నిరంతరం కొనసాగుతోంది. రాబోయే శ్రీరామ నవమి సందర్భంగా కోటి మంది భక్తులు అయోధ్యకు రావచ్చనే అంచనాలున్నాయి. ఈ నేపధ్యంలో ఆలయ అధికారులు ఇప్పటికే ఈ ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభించారు. తొమ్మిది రోజుల పాటు శ్రీరామ నవమి ఉత్సవాలు జరగనున్నాయి. చైత్ర మాసంలోని శుక్ల పక్షం తొమ్మిదవ రోజున శ్రీరాముని జన్మదినోత్సవం జరగనుంది. ఈసారి ఏప్రిల్ 17న శ్రీరామ నవమి జరగనుంది. చైత్ర నవరాత్రుల ప్రారంభంతో ఉత్సవాలు మొదలు కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రామజన్మభూమి గేట్ నంబర్ మూడు నుంచి కూడా భక్తులను అనుమతించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మార్గంలోని 40 అడుగుల వెడల్పు రోడ్డు నిర్మాణం పూర్తయింది. గతంలో ఈ మార్గాన్ని వీఐపీల రాకపోకలకు ఉపయోగించేవారు. దీంతో పాటు ఆలయ సముదాయానికి ఉత్తర దిశలో కొత్త రోడ్డును కూడా నిర్మిస్తున్నారు. రామజన్మభూమి మార్గాన్ని రైల్వే స్టేషన్‌కు అనుసంధానించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 🏹🎉