అమితాబ్ బచ్చన్ తర్వాత ఇప్పుడు తాజాగా రజనీకాంత్‌కు గోల్డెన్ టికెట్ అందజేశారు బీసీసీఐ సెక్రటరీ జై షా. త్వరలో ప్రారంభంకాబోతున్న ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్ కప్ 2023 ప్రచారంలో భాగంగా రజనీకాంత్‌కు ఈ గోల్డెన్ టికెట్ అందజేశారు.
ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023కు భారత్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఈ ప్రపంచ కప్ పోటీలు జరగనున్నాయి. అయితే, ఈ మెగా ఈవెంట్‌కు వీలైనంత ఎక్కువ ప్రచారం కల్పించడంలో భాగంగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) గోల్డెన్ టికెట్‌ను తీసుకొచ్చింది. ఇండియాలోని ప్రముఖులకు ఈ గోల్డెన్ టికెట్‌ను అందజేస్తోంది. ఈ గోల్డెన్ టికెట్ పొందిన ప్రముఖులు వరల్డ్ కప్ మ్యాచ్‌లో వీఐపీ మర్యాదలు పొందుతారు.
అయితే, ఈ గోల్డెన్ టికెట్‌ను ముందుగా బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ అందుకున్నారు. బీసీసీఐ సెక్రటరీ జై షా.. స్వయంగా అమితాబ్ బచ్చన్‌కు గోల్డెన్ టికెట్ అందజేశారు. ఆ తరవాత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు గోల్డెన్ టికెట్ ఇచ్చారు. ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను కలిసి ఆయనకు గోల్డెన్ టికెట్ అందజేశారు. ఈ మేరకు బీసీసీఐ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్ ద్వారా ప్రకటించారు. రజనీకాంత్‌కు జై షా గోల్డెన్ టికెట్‌ను అందజేస్తున్న ఫొటో కూడా షేర్ చేశారు.🇮🇳🏏💫