top of page

బీ అలర్ట్‌.. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు, ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ..


ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం రెండు రోజులు పశ్చిమ, వాయువ్యం దిశగా ప్రయాణిస్తూ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ను జారీ చేసింది. మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ చేసింది. ఈ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి శుక్రవారం వాయవ్యంలో కేంద్రీకృతం అయ్యే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శనివారం నాటికి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా వైపు కదిలే క్రమంలో బలపడి వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. శుక్రవారం.. ఆదిలాబాద్‌, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాలతో పాటు జగిత్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబతోంది. ఇక శనివారం జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని, మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇక ఆదివారం రోజు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మెదక్, కామారెడ్డిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

 
 
bottom of page