భారతదేశంలో మెదడు ఆరోగ్య సంబంధిత సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. పక్షవాతం, మూర్ఛ, జ్ఞాపకశక్తి కోల్పోవడం, డిప్రెషన్, ఆందోళన వంటి వ్యాధులు సర్వసాధారణమైపోతున్నాయి. లాన్సెట్ గ్లోబల్ హెల్త్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, 1990 నుంచి 2019 వరకు భారతదేశంలో ఈ పరిస్థితులలో 43% పెరుగుదల కనిపించింది. వాస్తవానికి.. మెదడు శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం. ఆరోగ్యంగా ఉండటమే జీవన నాణ్యతకు ఆధారం.. అటువంటి పరిస్థితిలో మెదడుకు సంబంధించిన సమస్యలు, పనితీరుపై అవగాహనతో ఉండటం చాలా ముఖ్యం.. మెదడులో సంభవించే రుగ్మతలను ప్రారంభ దశలోనే గుర్తించవచ్చు. దీనితో పాటు మెదడు ఆరోగ్యంగా ఉండేలా చర్యలు తెలుసుకోవచ్చు.
ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం, హెచ్చరిక సంకేతాలకు శ్రద్ధ చూపడం ద్వారా, మన మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.. ఇంకా మెరుగైన జీవన నాణ్యతను పొందవచ్చని న్యూరాలజిస్ట్‌లు, వైద్య నిపుణులు చెబుతున్నారు.
హెచ్చరిక సంకేతాలపై శ్రద్ధ వహించండి..
మీరు జ్ఞాపకశక్తి కోల్పోవడం, గందరగోళం, మానసిక స్థితి మార్పులు లేదా ఆలోచించడం, ఏకాగ్రతలో ఇబ్బంది వంటి లక్షణాలను గమనించినట్లయితే, వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి. వైద్య చికిత్స అవసరమయ్యే మెదడు ఆరోగ్య సమస్యలకు ఇవి సంకేతాలు కావచ్చని నిపుణులు అంటున్నారు.
మెదడు ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి..
జీవనశైలిలో మార్పులు చేయడం ద్వారా మన మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.. ఆ చిట్కాలు ఎంటో తెలుసుకోండి..
వ్యాయామం : శారీరక శ్రమ రక్త ప్రసరణ, అభిజ్ఞా విధులను పెంచుతుంది. నడక, పరుగు, యోగా, క్రీడలు వంటి కార్యకలాపాలు ముఖ్యంగా మెదడుకు ప్రయోజనకరంగా ఉంటాయి.
పోషకరమైన ఆహారాన్ని తినండి: పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లతో కూడిన సమతుల్య ఆహారం మెదడుకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. చేపలు, అవిసె గింజలు, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి.. ఇవి మెదడుకు ప్రయోజనకరంగా ఉంటాయి.
మానసికంగా చురుకుగా ఉండండి: పజిల్స్ పరిష్కరించడం, పుస్తకాలు చదవడం, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, మెదడును సవాలు చేసే ఇతర కార్యకలాపాలలో నిమగ్నమై జ్ఞాన సామర్థ్యాలను పెంచుతుంది.. దీని ద్వారా చిత్తవైకల్యం ప్రమాద తీవ్రతను నివారిస్తుంది..
తగినంత నిద్ర పొందండి : జ్ఞాపకశక్తిని బలోపేతం చేయడానికి, ఇంకా శరీరంలోని విషాన్ని తొలగించడానికి తగినంత నిద్ర అవసరం. ప్రతి రాత్రి 7-8 గంటల మంచి నిద్రను లక్ష్యంగా పెట్టుకోండి.
ఒత్తిడిని తగ్గించండి: ఒత్తిడి మెదడు ఆరోగ్యానికి హానికరం. యోగా, ధ్యానం, లోతైన శ్వాస వ్యాయామాలు ఒత్తిడిని తగ్గించడానికి, మొత్తం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
అందరితో కనెక్ట్ అయి ఉండండి: మెదడు ఆరోగ్యానికి బలమైన సామాజిక సంబంధాలు ముఖ్యమైనవి. కుటుంబం, స్నేహితులతో సమయం గడపండి. సామాజిక కార్యక్రమాలలో పాల్గొనండి.. క్లబ్‌లు లేదా సమూహాలలో చేరండి..