top of page
MediaFx

తెరవెనుక రాజమౌళిని పరిచయం చేస్తున్నారు..


ఇప్పటిదాకా ఆర్ఆర్ఆర్, బాహుబలి లాంటి వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ల దర్శకుడిగా పరిచయమున్న రాజమౌళి బ్యాక్ స్టోరీ ఎలా ఉంటుందో సామాన్య ప్రేక్షకులకు తెలియదు. అయన సినిమాలకు సంబంధించిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో హీరోలు, టెక్నీషియన్లు చెప్పే ముచ్చట్లలో కొన్ని బయట పడటం తప్పించి పూర్తి అవగాహన ఎవరూ ఇవ్వలేకపోయారు. నెట్ ఫ్లిక్స్ ఆ బాధ్యత తీసుకుంది. మోడరన్ మాస్టర్స్ పేరుతో రూపొందించిన డాక్యుమెంటరీ సిరీస్ లో టాలీవుడ్ దర్శక ధీర ఎస్ఎస్ రాజమౌళి మీద ఒక ప్రత్యేక ఎపిసోడ్ రూపొందించింది. దానికి సంబంధించిన ట్రైలర్ ఇవాళ వదిలారు.

జేమ్స్ క్యామరూన్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి, రమా రాజమౌళి, కరణ్ జోహార్ తదితరులు పంచుకున్న ఆసక్తికరమైన ఎన్నో కబుర్లు ఇందులో భాగం కాబోతున్నాయి. జక్కన్నకు కోపం వస్తే ఎలా ఉంటుంది. అందరూ పని రాక్షసుడు అని ఎందుకు అంటారు, ఎంత స్టార్ హీరో అయినా జక్కన్న దగ్గర మాములు ప్రేక్షకుడిగా ఎలా మారిపోతాడు లాంటి ప్రశ్నలకు సమాధానం దొరకనుంది. కథని ఎంత ఎక్కువగా ప్రేమిస్తే అంత గొప్పవాడవుతాడనే సత్యాన్ని స్వయంగా రాజమౌళినే చెప్పడం. రెండు నిమిషాల్లోనే ఇన్ని విశేషాలు ఉంటే ఇక ఫుల్ లెన్త్ ఎపిసోడ్ సినిమాను మించి చూడటం ఖాయం.

ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్, ఫిలిం కంపానియన్ ఫేమ్ అనుపమ చోప్రాతో పాటు సమీర్ నాయర్, దీపక్ సెహగల్ ఈ సిరీస్ ని నిర్మించారు. దర్శకత్వం వహించే ఛాన్స్ రాఘవ్ ఖన్నాకు దక్కింది. ఇంతకు ముందు యష్ రాజ్ ఫిలింస్ సంస్థ మీద ఇలాంటి సిరీస్ రూపొందించిన నెట్ ఫ్లిక్స్ ప్రత్యేకంగా ఒక టాలీవుడ్ డైరెక్టర్ గురించి చేయడం ఇదే మొదటిసారి. అందులోనూ ఇప్పటిదాకా ప్రపంచానికి తెలియని రాజమౌళి కెరీర్లోని ముఖ్యమైన సంగతులను, ఆయన కష్టం వెనుక రహస్యాలను తెలుసుకునే అవకాశం దక్కుతుంది. తారక్, చరణ్ లను ప్రోమోలో ఎక్కువగా హైలైట్ చేయడంతో ఇద్దరి అభిమానులు మిస్ కాకుండా చూస్తారు.

bottom of page