తరువాతి నెలలో బడ్జెట్‌ను సమర్పించడానికి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. బీజేపీతో పాటు దాని కూటమి పార్టీల నుంచి 72 మంది సభ్యులు క్యాబినెట్, సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నిర్మలా సీతారామన్ జూలైలో 6వ పూర్తి స్థాయి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపుల రూపంలో సువర్ణావకాశం ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
పన్ను చెల్లింపుదారులు ఈసారి బడ్జెట్‌లో పన్ను మినహాయింపులపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సెక్షన్ 80సీ, 80డీ కింద మినహాయింపు పరిమితుల్లో సీతారామన్ సవరణ చేస్తారని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ సెక్షన్ కింద పీపీఎఫ్, ఎన్‌పీఎస్, చిన్న పొదుపులు, జీవిత బీమా, ఈఎల్ఎస్ఎస్, యూలిప్‌లు, హోమ్ లోన్ ప్రిన్సిపల్ రీపేమెంట్ వంటి పలు పెట్టుబడులపై పన్ను ప్రయోజనాలను పొందవచ్చు.
నిపుణుల ప్రకారం, పన్ను స్లాబ్‌లను తగ్గించడం మరియు మినహాయింపులను క్రమబద్ధీకరించడం వంటి సులభతరం చేసే చర్యలు ఉండొచ్చని భావిస్తున్నారు. పన్ను విధానంలో డిజిటల్ సిస్టమ్‌ను పెంచేలా చర్యలు తీసుకోవడం ద్వారా పారదర్శకతను మెరుగుపరచడానికి అవకాశం ఉంది. ప్రత్యేకించి స్కూల్ ఫీజులపై సెక్షన్ 80సీ కింద మినహాయింపు ఇస్తారని భావిస్తున్నారు. అలాగే, బీమాను ప్రోత్సహించేందుకు 80డీ తగ్గింపును రూ. 25,000 నుంచి రూ. 75,000కి పెంచవచ్చని నిపుణులు చెబుతున్నారు.
కొత్త ప్రభుత్వం పన్ను వ్యవస్థను మరింత సుస్పష్టంగా మరియు సమర్థవంతంగా చేయడానికి సంస్కరణలను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పన్ను దాఖలు ప్రక్రియను సులభతరం చేయడానికి, పన్ను చెల్లింపుదారులపై పరిపాలనా భారాన్ని తగ్గించే చర్యలు తీసుకుంటారని భావిస్తున్నారు.