బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్‌కు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. సినిమాల్లో అతడు పోషించే పాత్రలకు.. నటనకు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. హిందీలో అనేక సినిమాల్లో నటించిన అనుపమ్ ఖేర్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. నిఖిల్ సిద్ధార్థ, అనుపమ నటించిన కార్తీకేయ 2 చిత్రంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అలాగే మాస్ మాహారాజా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు మూవీలో కనిపించారు. ఈ రెండు చిత్రాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫేమస్ అయిన తెలుగులో మరిన్ని సినిమాల్లో ఆఫర్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఓవైపు చేతినిండా సినిమాలతో బిజీగా ఉండే అనుపమ ఖేర్.. ఇటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. నిత్యం హిందుత్వం గురించి మాట్లాడుతూ వీడియోస్ షేర్ చేస్తుంటారు. తాజాగా అనుపమ్ ఖేర్ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరలవుతుంది. అనుపమ్ ఖేర్ ఆఫీసులో దొంగలు పడ్డారు.
ఈ విషయాన్ని చెబుతూ వీడియో షేర్ చేశారు. “నిన్న రాత్రి ఇద్దరు దొంగలు నా వీర దేశాయ్ రోడ్డులో ఉన్న కార్యాలయంలోకి చొరబడ్డారు. తలుపు పగులగొట్టి లోపలికి వచ్చి అకౌంట్ డిపార్ట్మెంట్ సెక్యూరిటీలో ఉన్న సినిమా నెగిటివ్స్ దొంగిలించారు. ఈ విషయంపై మా ఆఫీస్ సిబ్బంది ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దొంగలను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. సీసీటీవీలో ఇద్దరు దొంగలు వెళ్తున్న విజువల్స్ కనిపించారు. వారికి దేవుడు మంచి బుద్దిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. పోలీసులు రాకముందే ఆఫీస్ బయట ఉన్న వ్యక్తులు వీడియో తీశారు” అంటూ రాసుకొచ్చారు అనుపమ్ ఖేర్. ప్రస్తుతం అనుపమ్ ఖేర్ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరలవుతుండగా.. మీరు ముక్కుసూటిగా మాట్లాడతారని ఎవరో కావాలని చేసి ఉంటారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అనుపమ్ ఖేర్ గత 40 ఏళ్లలో దాదాపు 540 సినిమాల్లో నటించారు. ఇప్పటివరకు రూ.581 కోట్ల సంపాదన కలిగి ఉన్నారు. 2004లో పద్మ శ్రీ, 2016లో పద్మ భూషణ్ అవార్డ్ అందుకున్నారు.