దాదాపు 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నడూ ఎదుర్కొనని సంక్షోభంలో కూరుకుంది భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్). అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, అధినేత కేసీఆర్ కుమార్తె జైలుపాలవడం, లోక్ సభ ఎన్నికల్లో అసలు ఖాతాకే తెరవలేకపోవడం, ఎమ్మెల్యేలు పార్టీని వీడుతుండడం.. ఇలా అనేక సవాళ్లు. వీటిమధ్యన కేసీఆర్ ఫాంహౌజ్ లో కిందపడి గాయపడ్డారు. తుంటి విరిగిన ఆయనకు శస్త్రచికిత్స చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం నేరుగా ఫాం హౌజ్ కు వెళ్లిపోయిన కేసీఆర్.. ప్రగతి భవన్ ను ఖాళీ చేశారు. ఫాంహౌజ్ లోనే గాయపడిన ఆయనను హైదరాబాద్ తీసుకొచ్చారు.
గాయంతోనే ప్రచారానికి కేసీఆర్ వయసు దాదాపు 70. ఈ వయసులో ఆయన గాయపడడం పార్టీకీ ఇబ్బందిగా మారుతుందేమో? అనే సందేహాలు కలిగాయి. కానీ, మనోబలం దండిగా ఉండే కేసీఆర్ త్వరగానే కోలుకున్నారు. ఊతకర్రతో పర్యటనలు చేశారు. అలాగే లోక్ సభ ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నారు. మరోవైపు కొద్ది రోజులుగా కర్ర సహాయం లేకుండా నడుస్తున్నారు. ‘కారు’ నడపమన్న వైద్యులు.. గాయం కట్టుకోవడంతో కర్ర లేకుండా నడుస్తున్న కేసీఆర్ ను.. మ్యానువల్ కారు.. అంటే గేర్లు ఉన్న కారు నడిపి చూడమని వైద్యులు సూచించారు. దీంతో తన పాత ఓమ్నీ వ్యాన్ ను ఆయన నడిపారు. ఈ మేరకు ఫొటోలు బయటకు వచ్చాయి.
ఫాం హౌస్ లో పాత కారుతో.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రస్తుతం ఎర్రవల్లిలోని తన ఫాం హౌస్ లో ఉన్నారు. పార్టీ మారద్దొంటూ ఎమ్మెల్యేలను అక్కడికే రప్పించుకుని సమావేశం అవుతున్నారు. ప్రస్తుత కష్టాలు తాత్కాలికం అని ధైర్యం చెబుతున్నారు. ఇప్పుడు ఓమ్ని కారును కూడా అక్కడే నడిపినట్లు స్పష్టమవుతోంది. కేసీఆర్ విశాల ఫాంహౌస్ లో పొలాల్లో తిరిగేందుకు ప్రత్యేక వాహనాలు ఉన్నాయి. అందులోనే ఇలాంటి ఓమ్ని వ్యాన్ కూడా ఒకటి. కాగా, ఓమ్ని వ్యాన్ మాన్యువల్ కాబట్టి క్లచ్ వేస్తూ, యాక్సిలేటర్ ను కాళ్లతో తొక్కాల్సి ఉంటుంది. ఇది కేసీఆర్ కాలుకు ఓ విధంగా పరీక్ష అన్నమాట. ఇందులో ఎలాంటి ఇబ్బందీ లేకపోతే సరి. ఏమైనా సమస్యగా అనిపిస్తే వైద్యులు మరో చికిత్స మార్గం ఏమైనా ఆలోచిద్దామని భావించినట్లున్నారు.