జేపీ నడ్డాకు సమన్లు పంపారు బెంగళూరు పోలీసులు. మే5న బీజేపీ ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టును పెట్టారు. ముస్లింలకు ఆ ట్వీట్ వ్యతిరేకంగా ఉందంటూ బెంగళూరు పోలీసులు.. ట్విట్టర్ ఎక్స్‌కు తెలిపారు. వెంటనే ఆ ట్వీట్‌ను తొలగించాలని కోరారు. అంతేకాదు.. అదేరోజు ట్వీట్ మీద విచారణకు ఆదేశించింది డీజీపీ ఆఫీస్. దీంతో బెంగళూరు లోని హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అంతేకాదు.. ముస్లింలకు వ్యతిరేతకంగా ఉన్న ట్వీట్‌పై వివరణ ఇవ్వాలంటూ బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకు, బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాళవియా, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బీవై విజయేంద్రకు సమన్లు జారీచేశారు బెంగళూరు పోలీసులు. వారం రోజుల్లో తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీచేశారు.
అసలు బెంగళూరు పోలీసులు నడ్డాకు సమన్లు జారీ ఎందుకు చేశారు? ఇది కాంగ్రెస్ స్టేట్స్ వార్‌గా మారిందా? ఆ మధ్య బీజేపీ జాతీయ నేత.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ముస్లిం రిజర్వేషన్లపై మాట్లాడితే.. దేశంలో ఉన్న రిజర్వేషన్లు అన్నీ తొలగిస్తాం అన్న విధంగా మార్ఫింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఆ పోస్టు రావడంతో సీఎం రేవంత్, తెలంగాణ సోషల్ మీడియా టీమ్‌పై బీజేపీ ఫిర్యాదుమేరకు కేసు పెట్టారు ఢిల్లీ పోలీసులు. అంతేకాదు రేవంత్ తమ ముందు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చారు. దీనికి ప్రతిగానే ఇప్పుడు నడ్డాపై కేసు పెట్టారంటూ కామెంట్స్ వస్తున్నాయి.
బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలూ.. అటూ, ఇటూ మార్ఫింగ్ వీడియోలు పోస్టు చేయడం వల్లే ఇరుక్కున్నారు. మొదట బీజేపీ కేసు పెడితే.. ఆతర్వాత కాంగ్రెస్ రివేంజ్ కేసు పెట్టినట్లు కనిపిస్తోంది. ఈ సోషల్ మీడియా వార్ ఇప్పుడు పోలీస్ వార్‌గా మారింది. బీజేపీ ఢిల్లీ పోలీసుల ద్వారా రేవంత్‌పై కేసు పెడితే.. ఇప్పుడు బెంగళూరు పోలీసుల ద్వారా బీజేపీ చీఫ్ పైనే కేసు పెట్టింది కాంగ్రెస్. ఈ వార్ ఎంతవరకు దారి తీస్తుందో చూడాలి.