ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ పాలసీ కుంభకోణంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నారు. అయితే ఆగస్టు 15న జరిగే ప్రభుత్వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో తన స్థానంలో కేబినెట్ మంత్రి అతిషి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని సీఎం అరవింద్ కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్‌కు బుధవారం లేఖలో తెలిపారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. ఆగస్టు 15న అతిషి తన స్థానంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారని కేజ్రీవాల్ జైలు నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు లేఖ రాశారని ఓ ప్రకటనలో తెలిపింది.
కాగా ప్రతి సంవత్సరం ఢిల్లీ ప్రభుత్వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఛత్రసాల్ స్టేడియంలో జరుగుతాయి. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అయితే ఈ ఏడాది మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కేసులో కేజ్రీవాల్ తీహార్ జైల్లో ఉన్నందున ఆయనకు బదులు అతిషి జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జూన్ 20న కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసినా.. రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన ఉత్తర్వును ఢిల్లీ హైకోర్టు నిలిపివేసిన సంగతి విధితమే. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వాదనలను వినే వరకు కేజ్రీవాల్‌కు కల్పించిన బెయిల్ ఉపశమనంపై మధ్యంతర స్టే విధించింది.
77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దేశ వ్యాప్తంగా ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, జాతీయ గీతం ఆలపిస్తారు. ప్రధాన వేడుకలు ఢిల్లీలోని ఎర్రకోటలో జరుగుతాయి. ప్రధానమంత్రి మోదీ జాతీయ జెండాను ఎగురవేస్తారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు.