తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆఖరి అంకానికి చేరుకుంది. ఎగ్జిట్ పోల్స్‌లో ఊహించినట్లుగానే కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దిశగా దూసుకెళుతోంది. ఇప్పటికే మెజార్టీ స్థానాల్లో హస్తం పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ను అలవోకగా అందుకునే అవకాశముంది.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆఖరి అంకానికి చేరుకుంది. ఎగ్జిట్ పోల్స్‌లో ఊహించినట్లుగానే కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దిశగా దూసుకెళుతోంది. ఇప్పటికే మెజార్టీ స్థానాల్లో హస్తం పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ను అలవోకగా అందుకునే అవకాశముంది. మరోవైపు వరుసగా మూడో సారి అధికారంలోకి రావాలన్న బీఆర్‌ఎస్ ఆశలు ఆవిరైపోయాయి. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు కూడా బీఆర్‌ఎస్ పరాజయాన్నిఅంగీకరించారు. రెండుసార్లు తమకు అధికారాన్ని అందించిన తెలంగాణ సమాజం పట్ల, ప్రజల పట్ల కృతజ్ఞతతో ఉంటామని, ఈ ఫలితాలను ఒక పాఠంగా భావిస్తామని, మళ్లీ పుంజుకొంటామన్నారు కేటీఆర్, హరీశ్ రావు. మరోవైపు ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయనున్నారు. దీనికి సంబంధించి మరికాసేపట్లో ఆయన రాజ్ భవన్ కు చేరుకోనున్నారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి తన రాజీనామాను సమర్పించనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం.. గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరినట్లు తెలుస్తోంది.
కాగా ఎన్నికల ఫలితాలు వెల్లడి కాకముందే సోమవారం (డిసెంబర్ 4)న మంత్రివర్గ సమావేశానికి సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశాన్ని రద్దు చేస్తారా? లేదా? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. కాగా ఈ ఎన్నికల్లో గజ్వేల్‌తోనూ కామారెడ్డిలోనూ సీఎం కేసీఆర్ పోటీచేశారు. అయితే కామారెడ్డిలో కేసీఆర్ ఓటమి పాలయ్యారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి విజయం సాధించారు. సీఎం కేసీఆర్ మూడో స్థానంలో నిలిచారు.🗳️🏛️