దరఖాస్తులను బయట ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు అవసరమైనన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచాల్సిందేనని అధికారులకు స్పష్టం చేశారు. 'ప్రజాపాలన' కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు విధిగా భాగస్వామ్యం కావాలని సూచించారు.
రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల కోసం 'అభయహస్తం' దరఖాస్తుల అమ్మకాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించి సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 28 నుంచి గ్రామసభల ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైన నేపథ్యంలో దరఖాస్తుల సరళి, స్వీకరణ విధానం, ప్రజల్లో స్పందన వంటి వాటిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులను బయట ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు అవసరమైనన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచాల్సిందేనని అధికారులకు స్పష్టం చేశారు. 'ప్రజాపాలన' కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు విధిగా భాగస్వామ్యం కావాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోను ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, కేంద్రాల్లో దరఖాస్తుదారులకు తాగునీరు, సరైన నీడ కోసం టెంట్లు, ఇతర ఏర్పాట్లలో ఎలాంటి లోటు రాకుండా చూడాలని అధికారులకు మరోసారి స్పష్టం చేశారు.📈📝
గందరగోళాలపై స్పష్టత
ఇక, 'ప్రజాపాలన' దరఖాస్తులకు సంబంధించి ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురి కావొద్దని సీఎం తెలిపారు. రైతుబంధు, పింఛన్లపై అపోహలకు గురి కావొద్దని, పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. గతంలో లబ్ధి పొందని వారు, కొత్తగా లబ్ధి పొందాలనుకునే వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.
దరఖాస్తుల వెల్లువ
మరోవైపు, 'ప్రజాపాలన'కు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించిన రెండు రోజుల్లో కేంద్రాల వద్ద అధిక రద్దీ నెలకొంది. ఇప్పటివరకూ దాదాపు 15 లక్షలకు పైగా అర్జీలు వచ్చాయని అధికారులు వెల్లడించారు. 5 గ్యారెంటీలకు సంబంధించి లబ్ధి కోసం దరఖాస్తులు సమర్పించేందుకు ప్రజలు గ్రామ, వార్డు, డివిజన్ సభలకు పోటెత్తుతున్నారు. తొలి రోజు 7,46,414 అర్జీలు రాగా, రెండో రోజు రాష్ట్రవ్యాప్తంగా 8,12,862 అర్జీలు వచ్చాయి. జీహెచ్ఎంసీ, ఇతర కార్పొరేషన్లు, పట్టణాల్లో 4,89,000 దరఖాస్తులు రాగా, గ్రామాల్లో 3,23,862 అప్లికేషన్స్ వచ్చాయి. కొన్ని చోట్ల కేంద్రాల సమీపంలో బయటి వ్యక్తులు రూ.20 నుంచి రూ.100కు ఫారాలు విక్రయిస్తున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇదే అదునుగా కొందరు జిరాక్స్ సెంటర్ల నిర్వాహకులు సైతం అర్జీదారుల నుంచి వసూళ్లకు పాల్పడ్డారు. అయితే, జిరాక్సులను అధికారులు తిరస్కరిస్తున్నారు.
దరఖాస్తులు నింపేందుకు వాలంటీర్లు
మరోవైపు, అన్ని కేంద్రాల్లోనూ ప్రజలకు అవసరమైన దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. రెండో రోజు 'ప్రజాపాలన' కార్యక్రమంపై శుక్రవారం కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలు దరఖాస్తులను డబ్బులు పెట్టి కొనుగోలు చేసే పరిస్థితి తేవొద్దని నిర్దేశించారు. కేంద్రాల వద్ద బారికేడింగ్, తాగునీటి సదుపాయం, టెంట్లు ఏర్పాటు చేయాలన్నారు. దరఖాస్తులు నింపడంలో ప్రజలకు సహకరించేలా వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు.📈📝