top of page
MediaFx

కమ్యూనిస్ట్ నేత, బెంగాల్ మాజీ సీఎం బుద్దదేవ్ భట్టాచార్య కన్నుమూత..


కమ్యూనిస్ట్ యోధుడు, పశ్చిమ్ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య గురువారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 80 ఏళ్లు కాగా.. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్వాసకోస సమస్యతో తరుచూ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరుతున్న ఆయన.. గతేడాది న్యూమోనియా బారినపడి వెంటిలేటర్‌పై చికిత్స తీసుకున్నారు. కానీ, వైద్యుల ప్రయత్నాలు ఫలించి ఆయన కోలుకుని, ఆరోగ్యంగా ఇంటికి చేరుకున్నారు. అప్పటి నుంచి ఇంటికే పరిమితమైన బుద్ధదేవ్.. ఈ రోజు ఉదయం తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య మీనా.. కుమారుడు సుచేతన్ ఉన్నారు. జ్యోతిబసు వారసుడిగా బెంగాల్ ముఖ్యమంత్రి పదవిని 2000లో చేపట్టిన భట్టాచార్య.. 2011 వరకూ కొనసాగారు. ఆ ఏడాది జరిగిన శాసససభ ఎన్నికల్లో బెంగాల్‌‌లో కమ్యూనిస్ట్ పార్టీ 34 ఏళ్ల సుదీర్ఘ పాలనకు మమతా బెనర్జీ ముగింపు పలికారు. తృణమూల్ కాంగ్రెస్ ఆ ఎన్నికల్లో విజయం సాధించడంతో కమ్యూనిస్ట్‌ల శకం ముగిసింది. భట్టాచార్య నాయకత్వంలోనే కమ్యూనిస్ట్ పార్టీ ఎన్నికల్లో పోటీచేసి దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. మార్చి 1, 1944లో జన్మించిన బుద్ధదేవ్ భట్టాచార్య.. కోల్‌కతా ప్రెసిడెన్సీ కాలేజీలో విద్యాభ్యాసం పూర్తిచేశారు. కొద్ది రోజుల పాటు ఉపాధ్యాయుడిగా పనిచేసిన అనంతరం 1966 కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. బెంగాల్‌లో జరిగిన ఆహార ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 1972లో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడిగా.. 1982లో ఆ పార్టీ సెక్రెటరీగా నియమితులయ్యారు. మొదటిసారి 1977 ఎన్నికల్లో కాషీపూర్-బెల్గచియా స్థానం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అదే ఎన్నికల్లో కాంగ్రెస్ పాలన ముగిసి కమ్యూనిస్ట్‌‌లు అధికారంలోకి వచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే మంత్రి పదవి వరించింది. కానీ, 1982 ఎన్నికల్లో స్వల్ప తేడాతో భట్టాచార్య ఓడిపోగా.. తర్వాత సీపీఐ(ఎం) కేంద్ర కమిటీలో శాశ్వత సభ్యుడిగా నియమితులయ్యారు. మళ్లీ 1987 ఎన్నికల్లో జాదవ్‌పూర్ నుంచి గెలిచి.. 2011 వరకూ అదే స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. జ్యోతిబసు క్యాబినెట్‌లో పలు శాఖలకు మంత్రులుగా పనిచేసిన సీనియర్ నేత.. 1999లో డిప్యూటీ సీఎం అయ్యారు. 2000లో అనారోగ్యం వల్ల జ్యోతిబసు సీఎం పదవికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో పగ్గాలు చేపట్టారు. 2001, 2006 ఎన్నికల్లో పార్టీని విజయం దిశగా నడిపించారు.


bottom of page