మరో యాత్రకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ..
- MediaFx
- Aug 30, 2024
- 1 min read
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరో యాత్రకు సిద్ధమవుతున్నారు. ఘర్షణల నివారణకు యువతకు హింస రహిత విధానాలు నేర్పించడం తమ లక్ష్యమని ప్రకటించారు. అన్నట్టు రాహుల్ చేపట్టబోయే యాత్ర పేరు డోజో యాత్ర. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్ర సందర్భంగా చేసిన మార్షల్ ఆర్ట్స్ శిక్షణ వీడియో విడుదల చేశారు. ఇందులో బ్రెజిల్ యుద్ధ విద్య జియు-జిట్సును శిక్షణ ఇస్తూ రాహుల్ గాంధీ కనిపించారు. జియు-జిట్సులో రాహుల్ గాంధీకి బ్లాక్‌బెల్ట్ ఉంది. ధ్యానం, జియు-జిట్సు, ఐకిడో వంటివి సమ్మిళితం చేస్తూ యువ మనస్సుల్లోకి ఈ సున్నితమైన కళను ప్రవేశపెట్టడం తమ లక్ష్యమని ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ వెల్లడించారు. రెండు విడతలుగా చేపట్టిన భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ్‌యాత్ర సందర్భంగా ప్రతీ రోజు సాయంత్రం తమ క్యాంపులో ఈ యుద్ధ విద్యల అభ్యాసం జరిగేదని రాహుల్ తెలిపారు. హింసను సౌమ్యతగా మార్చి సురక్షితమైన, సానుభూతితో కూడిన సమాజాన్ని నిర్మించేందుకు యువతలో ఈ విలువలు జొప్పించాల్సన్నది తమ ఆలోచన అని రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా వివరించారు. తన సందేశానికి కొనసాగింపుగా చివర్లో భారత్ డోజో యాత్ర త్వరలో ఉంటుందని రాహుల్ తెలిపారు. మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇచ్చే హాల్ లేదా కేంద్రాన్ని డోజో అని పిలుస్తారు.