2011 తర్వాత వన్డే ప్రపంచకప్ గెలవాలన్న టీమిండియా కల కలగానే మిగిలిపోయింది. ఈ ప్రపంచకప్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన భారత జట్టు వరల్డ్ చాంపియన్‌గా నిలుస్తుందని అందరూ భావించారు.
అయితే ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ సేన అనూహ్యంగా ఓటమి పాలైంది. ఫైనల్‌లో పరాజయం చెందడంతో ఆటగాళ్లతో పాటు కోట్లాది మంది కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కన్నీటీ పర్యంతమై మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు హిట్ మ్యాన్. దక్షిణాఫ్రికాతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు కూడా దూరంగా ఉన్నాడు. అయితే డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌లో టీమిండియాకు సారథ్యం వహించనున్నాడు రోహిత్. ప్రస్తుతం టెస్ట్ సిరీస్ కోసం రెడీ అవుతోన్న రోహిత్ ప్రపంచ కప్ ఫైనల్ ఓటమిపై మరోసారి ఎమోషనల్ అయ్యాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేశాడు. ‘ప్రపంచకప్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాను. కప్ గెలవలేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి 50 ఓవర్ల ప్రపంచకప్ చూస్తూ పెరిగాను. ఇది నాకు గొప్ప అవకాశం. ఇందుకోసం చాలా కష్టపడ్డాం కూడా. అయితే చివరి దశలో తడబడడం మమ్మల్ని బాగా నిరాశపరిచింది. మన కలలు నెరవేరనప్పుడు చాలా నిరాశ కలుగుతుంది. ప్రస్తుతం నేను కూడా చాలా నిరాశగా ఉన్నాను. వరల్డ్‌కప్ ఫైనల్లో ఓటమిని ఎలా అధిగమించాలో తెలియలేదు. ఆ ఓటమి నన్ను తీవ్రంగా కలిచి వేసింది. అభిమానుల ఆశలను అడియాశలు చేయడం ఎంతో బాధించింది’