టీమిండియా తొలితరం టెస్ట్ క్రికెటర్, దేశంలో ఇంకా జీవించి ఉన్న అతి ఎక్కువ వయసు టెస్ట్ క్రికెటర్ గా పేరుగాంచిన దత్తాజీరావు గైక్వాడ్ కన్నుమూశాడు. మంగళవారం (ఫిబ్రవరి 13) అతడు బరోడాలో తుదిశ్వాస విడిచారు.🏏😢
టీమిండియా తరఫున 70 ఏళ్ల కిందట టెస్ట్ క్రికెట్ ఆడిన ప్లేయర్, మాజీ కెప్టెన్ దత్తాజీరావు గైక్వాడ్ 95 ఏళ్ల వయసులో కన్నుమూశాడు. మంగళవారం (ఫిబ్రవరి 11) బరోడాలోని తన ఇంట్లో అతడు తుది శ్వాస విడిచినట్లు మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సోషల్ మీడియా ఎక్స్ ద్వారా వెల్లడించాడు. ఇండియన్ టీమ్ తరఫున గైక్వాడ్ 11 టెస్టులు ఆడాడు.
టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ హెడ్ కోచ్ అన్షుమన్ గైక్వాడ్ తండ్రే ఈ దత్తాజీరావు గైక్వాడ్. ఇండియా తరఫున టెస్టు క్రికెట్ ఆడి జీవించి ఉన్న వాళ్లలో అత్యంత ఎక్కువ వయసు ఉన్న ప్లేయర్ గా దత్తాజీరావు గైక్వాడ్ పేరుగాంచాడు. జూన్ 1952లో ఇంగ్లండ్ పై టీమిండియా తరఫున తొలి టెస్ట్ ఆడిన గైక్వాడ్.. 9 ఏళ్ల పాటు 11 టెస్టులు ఆడాడు. అందులో నాలుగు టెస్టులకు కెప్టెన్ గా ఉన్నాడు. టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఈ విషయాన్ని వెల్లడించాడు.
"మోతీబాగ్ క్రికెట్ గ్రౌండ్ లో ఉన్న మర్రిచెట్టు నీడలో తన బ్లూ మారుతీ కారులో నుంచి మాజీ కెప్టెన్ డీకే గైక్వాడ్ బరోడా క్రికెట్ లోని ఎంతోమంది యువ ఆటగాళ్లను తీర్చిదిద్దారు. మన టీమ్ భవిష్యత్తుకు ఓ రూపునిచ్చారు. ఆయన లేకపోవడం తీరని లోటే. క్రికెట్ కమ్యూనిటీకి ఇది పూడ్చలేని నష్టం" అని ఇర్ఫాన్ పఠాన్ అతని మృతి వార్తను చెప్పాడు.
2016లో 87 ఏళ్ల వయసులో మాజీ క్రికెటర్ దీపక్ శోధన్ మరణం తర్వాత దేశంలో జీవించి ఉన్న ఓల్డెస్ట్ టెస్ట్ క్రికెటర్ ట్యాగ్ ఈ దత్తాజీరావు గైక్వాడ్ పేరుకి మారింది. గత 12 రోజులుగా దత్తాజీరావు బరోడా హాస్పిటల్లోని ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నట్లు న్యూస్ ఏజెన్సీ పీటీఐ వెల్లడించింది. దత్తాజీరావు గైక్వాడ్ తనయుడు అన్షుమన్ గైక్వాడ్ ఇండియా తరఫున 40 టెస్టులు, 15 వన్డేలు ఆడాడు.
ఆ తర్వాత టీమిండియా కోచ్ గానూ పని చేశాడు. ఇక దత్తాజీరావు గైక్వాడ్ 11 టెస్టుల్లో 350 పరుగులు చేశాడు. అందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది. 1959లో ఇంగ్లండ్ లో జరిగిన సిరీస్ లో నాలుగు టెస్టులకు ఇండియన్ టీమ్ కెప్టెన్ గానూ ఉన్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో బరోడా తరఫున 17 ఏళ్ల పాటు ఆడాడు. 1947 నుంచి 1964 మధ్య 110 మ్యాచ్ లలో 17 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలతో 5788 రన్స్ చేశాడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అతని అత్యధిక స్కోరు 249 పరుగులు. దత్తాజీరావు గైక్వాడ్ మరణానికి ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ సంతాపం తెలిపింది. బరోడా క్రికెట్ కు ఎనలేని సేవలందించిన గైక్వాడ్ ను ఆ ప్రాంతం నుంచి ఇండియన్ టీమ్ లోకి వచ్చిన ఇర్ఫాన్ లాంటి ప్లేయర్స్ ఆరాధిస్తుంటారు. దత్తాజీరావు గైక్వాడ్ తన చివరి టెస్టును 1961లో పాకిస్థాన్ పై ఆడటం విశేషం.🏏😢