దేశ జనాభాలో హిందువుల వాటా క్రమంగా క్షీణిస్తోందని, ఇదే సమయంలో ముస్లింల శాతం గణనీయంగా పెరుగుతోందని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. 1950 నుంచి 2015 మధ్య హిందువుల శాతం 7.82 శాతం క్షీణిస్తే.. ముస్లింలు 43.15 శాతం మేర పెరిగినట్టు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) పరిశోధన పత్రం పేర్కొంది. భారత్‌లో 1950 నాటికి 84.68%గా ఉన్న హిందువులు.. 2015 నాటికి 78.06%కు పడిపోయినట్టు తెలిపింది. అదే సమయంలో ముస్లింల 9.84% నుంచి 14.09%కు చేరిందని, పెరుగుదల 43.15 శాతంగా నమోదైనట్లు వివరించింది.
అయితే, 1950-2015 మధ్య క్రిస్టియన్లు (2.24 శాతం నుంచి 2.36 శాతానికి), సిక్కుల వాటా (1.24 శాతం నుంచి 1.84 శాతానికి) స్వల్పంగా పెరిగితే... జైనులు, పార్శీల శాతం తగ్గిందని చెప్పింది. పార్మీలు ఏకంగా 85 శాతం మేర తగ్గిపోయినట్టు తెలిపింది. 1950లో 0.03 శాతంగా ఉన్న వీళ్లు.. 2015 నాటికి 0.004 శాతానికి క్షీణించారు. భారతీయ సమాజంలో భిన్నత్వాన్ని పెంపొందించేందుకు వీలుగా ఉన్న సామరస్యపూరిత వాతావరణాన్ని ఈ మార్పులు సూచిస్తున్నాయని ప్రధాని సలహా మండలి అభిప్రాయపడింది.
విధానపరమైన చర్యలు, రాజకీయ నిర్ణయాలు, సామాజిక ప్రక్రియల ఫలితంగా ఈ మార్పులు సంతరించుకున్నట్టు తెలిపింది. శామికా రవి నేతృత్వంలోని ఈ సలహా మండలి మొత్తం 167 దేశాల్లో పరిస్థితులను అధ్యయనం చేసి ఈ మేరకు నివేదికను రూపొందించింది. అయితే, ఆయా వర్గాల జనాభా నిర్దిష్టంగా ఎంత ఉన్నారనేది మాత్రం వెల్లడించలేదు.
మెజార్టీ వర్గీయుల జనాభా తగ్గుతున్న ప్రపంచ పోకడలకు ప్రపంచ పోకడలకు అనుగుణంగా భారత్‌లో కూడా మెజారిటీ వర్గం హిందువుల వాటా 7.82 శాతం తగ్గిందని నివేదిక ఎత్తి చూపింది. ‘బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంక, భూటాన్, ఆఫ్ఘనిస్థాన్ వంటి దేశాలలో మెజారిటీ మతపరమైన జనాభా వాటా పెరిగింది.. మైనారిటీల శాతం భయంకరంగా క్షీణించింది.. ముఖ్యంగా దక్షిణాసియా పరిసరాల్లోని ఇది ప్రత్యేకంగా పరిగణించాల్సిన అంశం’ పరిశోధన పత్రం పేర్కొంది. అయితే, భారత్ పొరుగున ఉన్న దేశాల్లో మైనార్టీలు తగ్గిపోవడం ఆశ్చర్యకరమైన అంశం కాదని వ్యాఖ్యానించింది.
మాల్దీవులు మినహా అన్ని ముస్లిం మెజార్టీ దేశాలు మతపరమైన తమ వర్గం వాటాలో పెరుగుదల నమోదయ్యింది. మాల్దీవుల్లో మెజార్టీ వర్ఘమైన షఫీ సున్నీల వాటా 1.47% మేర తగ్గింది. భారత ఉపఖండంలో అత్యధికంగా బంగ్లాదేశ్‌లోనే మెజార్టీ వర్గం 18% నమోదైంది. దాయాది పాక్ మెజార్టీ వర్గం హనాఫీ ముస్లింల వాటా 3.75% పెరిగితే.. మొత్తంగా వారి జనాభాలో ముస్లింల వాటా 10% పెరుగుదల ఉంది. ముస్లిమేతర వర్గాలుగా ఉన్న దేశాలైన మయన్మార్, భారత్, నేపాల్‌లలో మెజార్టీ మతస్థుల వాటా క్షీణించింది. అయితే, గత 60 ఏళ్లలో 35 అధికాదాయ దేశాల్లో మెజార్టీ మతస్థుల వాటా సగటున 29% క్షీణించగా.. ప్రపంచ సగటు 21.9 శాతంతో పోలిస్తే ఇది ఎక్కువ.