top of page
MediaFx

డిప్యూటీ స్పీకర్‎పై ఇండియా కూటమి మాస్టర్ ప్లాన్..


లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్‌ పదవి దక్కించుకునేలా విపక్షాలు మాస్టర్‌ ప్లాన్‌ వేశాయా? ఫైజాబాద్‌ ఎంపీ అవధేష్‌ ప్రసాద్‌ పేరును టీఎంసీ అధినేత్రి మమతా ప్రతిపాదించడం వెనుక వ్యూహమేంటి? లోక్‌సభలో స్పీకర్‌ పదవిని దక్కించుకున్న ఎన్డీయే కూటమి..డిప్యూటీ స్పీకర్‌ పదవిపై కూడా కన్నేసింది. దాంతో విపక్ష ఇండి కూటమి కూడా అలర్ట్ అయ్యింది. సమాజ్‌ వాది పార్టీకి చెందిన ఎంపీ అవధేష్‌ ప్రసాద్‌ని లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ చేయాలని తృణమూల్ కాంగ్రెస్ తాజాగా ప్రతిపాదించింది. అవధేష్ ఇటీవల అయోధ్య రామ మందిరం నిర్మించిన ఫైజాబాద్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. రామమందిరం నిర్మించిన కొన్ని నెలల తర్వాత జరిగిన ఎన్నికల్లో ఈ ప్రాంతంలో బీజేపీ ఓడిపోయింది. దీంతో ఒక్కసారిగా అవధేష్ పేరు మార్మోగిపోయింది.

17వ లోక్‌సభ సమయం నుంచి ఖాళీగా ఉన్న డిప్యూటీ స్పీకర్ పదవికి ఇప్పటి వరకు కేంద్రం షెడ్యూల్ విడుదల చేయలేదు. ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చేందుకు కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ ఇష్టపడలేదు. అయితే, ఈసారి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిని బీజేపీ మిత్రపక్షాలకు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో ఫైజాబాద్ నుంచి గెలుపొందిన దళిత వ్యక్తి అవధేష్ ప్రసాద్ పేరును తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రతిపాదించినట్లు విశ్వసనీయ సమాచారం. బీజేపీకి చెందిన లల్లూ సింగ్‌పై అవధేష్ 50వేల కంటే ఎక్కువ ఓట్లతో గెలిచారు. రామ మందిరం కట్టినా కూడా బీజేపీని ప్రజలు ఆదరించలేదని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.

bottom of page