నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఉగాది మహోత్సవాల నేపథ్యంలో భక్తులకు దేవస్థానం కల్పిస్తున్న ఏర్పాట్లను నంద్యాల జిల్లా ఏఎస్పీ ప్రవీణ్, ఆలయ ఈవో పెద్దిరాజు, ఆలయ అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ఉగాది మహోత్సవాలలో భాగంగా రేపు సాయంకాలం జరుగునున్న ప్రారంభోత్సవం, రాత్రి జరుగనున్న వీరాచార విన్యాసాలు, అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమం ఎల్లుండి జరిగే రథోత్సవ నిర్వహణపై అధికారులు చర్చించారు. ఈ సందర్భంలో అధికారులు మాట్లాడుతూ ఉత్సవాలకు అధికసంఖ్యలో భక్తులు విచ్చేస్తారని తొక్కిసలాటలు జరగకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
అలానే ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. శివదీక్షా శిబిరాల వద్ద జరిగే వీరాచార విన్యాసాలు, అగ్నిగుండ కార్యక్రమ నిర్వహణ వద్ద ముందుజాగ్రత్త చర్యలలో భాగంగా ప్రథమచికిత్స కేంద్రాన్ని, ఫైరింజన్ అందుబాటులో ఉంచాలన్నారు. సమీక్షా అనంతరం ఈవో పెద్దిరాజు, ఏఎస్పీ, అధికారులు ప్రారంభోత్సవం, రథోత్సవంలో జరిగే ప్రదేశాన్ని పరిశీలించారు. అగ్నిగుండం జరిగే ప్రదేశం చుట్టూ పటిష్టమైనకంచె ఏర్పాటు చేసి భక్తులు వీక్షించేందుకు ఎల్.ఈ.డి స్క్రీన్ ఏర్పాటు చేయాలని ఈవో పెద్దిరాజు, ఏఎస్పీ ప్రవీణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.