బాలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన స్టార్ హీరోయిన్ కరీనా కపూర్..త్వరలో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమే వెల్లడించడం విశేషం.
‘ది క్రూ’ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న కరీనా కపూర్, పలు కీలక విషయాలను వెల్లడించింది. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన ఆమె, దక్షిణాది సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టే విషయంపై కీలక వ్యాఖ్యలు చేసింది. “నేను త్వరలో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నాను. ఓ భారీ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించబోతున్నాను. పాన్ ఇండియా మూవీగా ఆ చిత్రం తెరకెక్కుతోంది. తొలిసారి సౌత్ సినిమాలో నటిస్తున్నాను. షూటింగ్ ఎప్పుడు? ఎక్కడ? అనేది ఇంకా తెలియదు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నట్లు నేను భావిస్తున్నాను” అని వెల్లడించింది.
కరీనా కపూర్ కామెంట్స్ నేపథ్యంలో నెటిజన్లు ఆమె నటించబోయే సినిమా ఇదే అంటూ చర్చలు నడుపుతున్నారు. ప్రస్తుతం కన్నడ స్టార్ హీరో యశ్ ‘టాక్సిక్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంతోనే ఆమె సౌత్ లోకి ఎంట్రీ ఇస్తుందని భావిస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు? అనే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో కరీనా కపూర్ చేసిన కామెంట్స్ ను నెటిజన్లు ఈ చిత్రంతో లింక్ చేస్తున్నారు. కచ్చితంగా ఆమె నటించబోయేది యశ్ ‘టాక్సిక్’లోనే అంటున్నారు. త్వరలోనే కరీనా నటించే సినిమా ఏది అనే విషయంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 🎥✨