యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన సినిమా హనుమాన్. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం ఇలా అన్ని భాషల్లోనూ ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. కేవలం రూ. 40 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మేకింగ్, విజువల్స్, గ్రాఫిక్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్, అమృతా అయ్యార్, వినయ్ రాయ్, సముద్రఖని కీలకపాత్రలు పోషించారు. దాదాపు 150 థియేటర్లలో 50 రోజులకు పైగా విజయవంతంగా రన్ అయ్యింది. ఇక ఇటీవల ఓటీటీలో అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా సన్సెషన్ రెస్పాన్స్ అందుకుంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సీక్వెల్గా జై హనుమాన్ చిత్రాన్ని తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. అంతేకాకుండా సెకండ్ పార్టుకు జై హనుమాన్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేయనున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ పై మరిన్ని అంచనాలు పెరిగాయి. అలాగే జై హనుమాన్ సినిమాలో టాలీవుడ్ స్టార్స్ భాగం కానున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు సినీ ప్రియులు. ఈ క్రమంలోనే తాజాగా జై హనుమాన్ మూవీపై స్పెషల్ అప్డేట్ ఇచ్చాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.
ఇప్పటికే జై హనుమాన్ మూవీ స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ అయ్యిందని గతంలోనే వెల్లడించారు డైరెక్టర్. ఇక ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి స్పెషల్ గ్లింప్స్ షేర్ చేశారు. “అంజనాద్రి 2.0కి స్వాగతం” అంటూ క్యాప్షన్ ఇస్తూ షేర్ చేసిన వీడియోలో విజువల్స్ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. చుట్టూ అందమైన కొండలు.. మధ్యలో పెద్ద నది.. చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూపిస్తూ ఎంతో ప్రశాంతంగా కనిపిస్తుంది ఈ వీడియో.. ఈ వీడియోకు హనుమాన్ సినిమాలోని రఘునందన సాంగ్ అటాచ్ చేయగా.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది. ప్రశాంత్ వర్మ షేర్ చేసిన వీడియో చూస్తుంటే ఈసారి జై హనుమాన్ మూవీ మరింత గ్రాండ్గా ఉండనున్నట్లు తెలుస్తోంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని..జై హనుమాన్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నామని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.