డ్యూయల్ సిమ్ అనేది ప్రస్తుతం చాలా కామన్. ప్రతి ఫోన్లో రెండు స్లిమ్ స్లాట్ లతో వస్తున్నాయి. దీంతో అందరూ రెండు సిమ్ కార్డులను వినియోగిస్తున్నారు. ఇంటి నంబర్ ఒకటి, ఆఫీస్ నంబర్ ఒకటి అన్నట్లు రెండు సిమ్ కార్డులను వాడుతున్నారు. అందరూ దీనిని అలవాటు అయిపోయారు. మీరు కూడా ఇలానే రెండు సిమ్ కార్డులు వినియోగిస్తున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్. ఇకపై రెండు సిమ్ కార్డులు కలిగి ఉండటం ఖరీదైనదిగా మారిపోనుంది. ఎందుకంటే టెలికాం రంగంలో రానున్న రోజుల్లో టారిఫ్ ప్లాన్‌ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. 2021డిసెంబర్లో చివరిసారిగా టారిఫ్ ప్లాన్ ధర పెంచారు. ఇప్పుడు రెండున్నరేళ్ల తర్వాత వాటి ధరలను సవరించాలని టెలికాం దిగ్గజాలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటి వరకూ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ప్లాన్‌లలో ఎటువంటి మార్పు కనిపించలేదు. రానున్న రోజుల్లో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా రాబోయే కొద్ది నెలల్లో తమ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను పెంచవచ్చని పరిశ్రమ నిపుణులు పేర్కొంటున్నారు.
2 సిమ్ కార్డ్‌లు ఉన్న వ్యక్తులకు సమస్యలు..
మీరు ఫోన్‌లో రెండు సిమ్ కార్డ్‌లను ఉపయోగిస్తే, మీ సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే రెండో సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచడానికి మీరు ఎక్కువ ధర చెల్లించాల్సి రావచ్చు. ప్రస్తుతం జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా సిమ్‌లను యాక్టివ్‌గా ఉంచడానికి, కనీసం రూ. 150 రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ టారిఫ్ పెరిగితే సిమ్‌ను యాక్టివేట్‌గా ఉంచడానికి, రూ. 150కి బదులుగా, మీరు రూ. 180 నుంచి రూ. 200 వరకూ చెల్లించవలసి ఉంటుంది. మీరు రెండు సిమ్‌లను ఉపయోగిస్తే, మీరు కనీసం 28 రోజులకు రూ. 400 రీచార్జ్ చేయాల్సి ఉంటుంది.
ఏయే ప్లాన్‌ల ధర ఎంత పెరుగుతుంది?
మీరు నెలవారీ రూ. 300 రీఛార్జ్ చేసుకుంటే, టారిఫ్ పెరిగిన తర్వాత మీరు నెలకు దాదాపు రూ. 75 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. నెలవారీ రూ.500 రీఛార్జ్ చేసుకుంటే రూ.125 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
నెలవారీ ఖర్చులు పెరుగుతాయి..
రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ త్వరలో 5జీ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రారంభించవచ్చు. ఇది ప్రస్తుతానికి పూర్తిగా ఉచితం. అటువంటి పరిస్థితిలో, మీరు ఒక సిమ్ 5జీ, మరో సిమ్ 4జీని ఉంచినట్లయితే, మీ నెలవారీ ఖర్చు దాదాపు 50 శాతం పెరుగుతుంది. ఎందుకంటే 5జీ ప్లాన్ ధర 4జీ కంటే ఎక్కువగా ఉంటుంది. అలాగే 4జీ ప్లాన్ ధరను కూడా పెంచుతున్నారు. దీంతో మొత్తం వ్యయం బారీగా పెరగనుంది. ఇది వినియోగదారులపై పెను భారం కానుంది.