ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7 విడతల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల 7 వ తేదీన 3 వ దశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ ఎన్నికలకు సంబంధించి తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారుతోంది. అందులో ఓ బీజేపీ నాయకుడు.. తన కుమారుడితో ఓటు వేయిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఓటింగ్ మెషీన్ దగ్గరికి తన మైనర్ కుమారుడిని తీసుకెళ్లిన ఆ నేత.. అతడితో ఓటు వేయించడం ప్రస్తుతం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అంతేకాకుండా పోలింగ్ బూత్‌లోకి సెల్‌ఫోన్ తీసుకెళ్లడమే కాకుండా ఓటు వేయడాన్ని వీడియో తీయడం, దాన్ని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడం సంచలనంగా మారింది. దీన్ని అస్త్రంగా చేసుకుని కాంగ్రెస్ నేతలు.. బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. లోక్‌సభ ఎన్నికల మూడో దశ పోలింగ్‌లో భాగంగా ఈనెల 7 వ తేదీన మధ్యప్రదేశ్ భోపాల్‌లోని బెరాసియాలో ఓటింగ్ జరిగింది. ఈ క్రమంలోనే స్థానికంగా ఉన్న ఓ పంచాయతీ నేత, బీజేపీకి చెందిన వినయ్ మెహర్.. పోలింగ్ బూత్‌లోకి తన మైనర్ కుమారుడిని, సెల్‌ఫోన్‌ను తీసుకెళ్లాడు. తీసుకెళ్లిన వాడు సైలెంట్‌గా ఓటు వేసి రాకుండా.. తన ఓటును తన మైనర్ కుమారుడితో వేయించాడు. అక్కడ ఉన్న ఈవీఎం మెషీన్‌లో బీజేపీకి చెందిన కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
ఇక ఈవీఎం మెషీన్‌లో ఓటు వేసిన తర్వాత వీవీ ప్యాట్ మెషీన్‌లో కమలం పువ్వు గుర్తు కనిపించినట్లు ధ్రువీకరించుకున్నారు. అయితే తన కుమారుడికి ఓటు వేయమని సూచించడం, అతడు ఈవీఎంలో బటన్ నొక్కడం, దాన్ని వీవీ ప్యాట్ మెషీన్‌లో చూసుకోవడం మొత్తాన్ని తన సెల్‌ఫోన్‌లో వినయ్ మెహర్.. వీడియో రికార్డ్ చేశాడు. ఇక ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. 14 సెకన్లు ఉన్న ఆ వీడియోలో వినయ్ మెహర్‌తోపాటు అతని కుమారుడు స్పష్టంగా కనిపిస్తున్నారు.
బీజేపీ నేత వినయ్ మెహర్ చేసిన పనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను కోరింది. ఈ వ్యవహారం మొత్తం వీడియో తీసి బీజేపీ నేత వినయ్ మెహర్ ఆయన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ మీడియా సలహాదారుడు పీయూష్ బాబెలే తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ వీడియోను పీయూష్ బాబెలే ట్విటర్‌లో ఆయన షేర్ చేశారు. వినయ్ మెహర్ వెంట అతని కుమారుడిని, సెల్‌ఫోన్‌ను పోలింగ్ బూత్‌లోకి ఎలా అనుమతించారని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్‌ను ఆట వస్తువుగా బీజేపీ మార్చిందని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఈ ఘటనపై ఏమైనా చర్య తీసుకుంటారా అని ప్రశ్నించారు.
ఈ ఘటనపై భోపాల్ జిల్లా కలెక్టర్ కౌశలేంద్ర విక్రమ్ సింగ్ స్పందించారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై దర్యాప్తుకు ఆదేశించామని.. ఆ పోలింగ్ బూత్ ప్రిసైడింగ్ అధికారి, ఇతర సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటనకు కారణమైన బీజేపీ నేత వినయ్ మెహర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్లు తెలిపారు.