top of page
MediaFx

కేసీఆర్‌తో పంపకాల్లో తేడా రావడంతోనే బీఆర్ఎస్ నుంచి ఈటల బయటకు వచ్చారు


మల్కాజ్‌గిరి లోక్ సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డికి మద్దతుగా ఉప్పల్‌లో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ... గతంలో మంత్రిగా పని చేసిన ఈటల బీసీలకు ఏమైనా చేశారా? అని ప్రశ్నించారు.

కేసీఆర్‌తో పంపకాల్లో తేడా రావడంతో ఆయన బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారని... అంతేతప్ప ప్రజల కోసం కాదని వ్యాఖ్యానించారు. ఉప్పల్‍‌‌లో నిలిచిపోయిన ఫ్లైఓవర్ పనుల గురించి కేంద్రాన్ని ఎప్పుడైనా ప్రశ్నించారా? అని నిలదీశారు. కరోనా సమయంలో సీఎస్ఆర్ నిధులు దోచుకుంటుంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు.

లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీలోనే లేదన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటికే 35 కోట్ల మంది మహిళలు ప్రయాణించారని తెలిపారు. రాష్ట్రంలో 40 లక్షల కుటుంబాలు రూ.500కే సిలిండర్ తీసుకుంటున్నాయని వెల్లడించారు. దాదాపు 50 లక్షల కుటుంబాలు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని పొందుతున్నాయన్నారు. కాంగ్రెస్ శ్రేణుల ఉత్సాహం ఈ నెల 13వ తేదీ వరకు ఇలాగే కొనసాగాలని... సునీతా మహేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

bottom of page