హోలీ పండుగ వచ్చిందంటే రంగులతో ఆటలాడుకుంటారు. అయితే ఏ రంగు దేనికి ప్రతీకగా నిలుస్తుందనే విషయం మాత్రం తెలియదు. హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ఏ రంగు దేనికి ప్రతీకగా నిలుస్తుందో తెలుసుకుందాం.
ఎరుపు
ఇంద్రియాలు, స్వచ్ఛత రెండింటిని ఎరుపు రంగు సూచిస్తుంది. హిందూ మతంలో ఎరుపు రంగుకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. వివాహాలు, పండుగలు మొదలైన సందర్భాల్లో తరచుగా ఉపయోగించే రంగు ఇది. దేవతలకు కూడా ఎరుపు రంగు అంటే చాలా ప్రీతి. లక్ష్మీదేవికి ఎరుపు రంగు పూలు, చిమ్నీ సమర్పిస్తారు. ఈ రంగు శక్తి, ధైర్యం, ధార్మికం, పరాక్రమానికి సూచికగా భావిస్తారు.
కాషాయం
హిందూమతంలో అత్యంత పవిత్రమైన రంగుగా కాషాయం ఉంటుంది. ఇది అగ్నిని సూచిస్తుంది. శరీరం, మనసులోని మలినాల నుంచి ప్రక్షాళన చేసుకున్నామనే దానికి సూచికగా ఈ రంగుని భావిస్తారు. అందుకే సన్యాసులు ఎక్కువగా కాషాయ రంగు దుస్తులు ధరిస్తారు. ఆంజనేయ స్వామికి కాషాయ జెండా ఉంటుంది. హనుమంతుడి శరీరం మొత్తం కూడా ఇదే రంగు ఉంటుంది. దీని వెనుక ఒక చిన్న కథ కూడా ఉంది. ఒకరోజు సీతాదేవి తన నుదుటి మీద సింధూరం పెట్టుకుంటుంటే ఎందుకని హనుమంతుడు అడుగుతాడు. శ్రీరాముని రక్షణ, క్షేమాన్ని ఇది సూచిస్తుందని చెప్పడంతో అప్పటి నుంచి హనుమంతుడు తన శరీరం మొత్తం ఈ రంగు పులుముకుంటాడు.
ఆకుపచ్చ
ఆకుపచ్చ ఒక ప్రకృతిని సూచిస్తుంది. జీవితంలో ఆనందం, కొత్త ఆరంభానికి, సంతోషానికి ప్రతీకగా భావిస్తారు. ప్రకృతిని సూచించే రంగు ఆకుపచ్చ అందుకే ఈ రంగుకి కూడా ప్రాముఖ్యత ఇస్తారు.
పసుపు
పసుపు అనేది జ్ఞానం, అభ్యాసం సూచిస్తుంది. ఆనందం, శాంతి, ధ్యానం, సామర్థ్యం, మానసిక అభివృద్ధికి ప్రతీక. వసంత రుతువు సూచిస్తుంది. మనసుని ఉత్తేజపరుస్తుంది. విష్ణువు, శ్రీకృష్ణుడు, వినాయకుడికి ఇష్టమైన పసుపు రంగు వస్త్రాలు, పసుపు రంగు మిఠాయిలు సమర్పిస్తారు. వసంతోత్సవాలు పసుపు రంగులోనే ప్రారంభమవుతాయి. దుష్టశక్తులను దూరంగా ఉంచేందుకు పసుపు రంగు ధరిస్తారు. అమ్మాయిలు తమ సహచరులు ఆకర్షించేందుకు ఈ రంగు ఎక్కువగా ఎంచుకుంటారు. పసుపు పవిత్రమైనది.
తెలుపు
తెలుపు అనేది ఏడు వేరువేరు రంగుల మిశ్రమం. ఇది స్వచ్ఛతను, నాణ్యత, పరిశుభ్రత, శాంతిని, జ్ఞానాన్ని సూచిస్తుంది. జ్ఞానదేవత సరస్వతి ఎప్పుడు తెలుపు రంగు దుస్తులు ధరించి తామరపై కూర్చున్నట్లు చూపిస్తారు. ఆధ్యాత్మికతను సూచిస్తుంది. సంతానానికి కూడా ప్రతీక. అయితే హోలీ వేడుకల్లో తెలుపు మాత్రం ఉపయోగించకూడదు.
నీలం
సృష్టికర్త ప్రకృతికి నీలం రంగుని ఇచ్చాడు. ఆకాశం, సముద్రం, నదులు, సరస్సులో నీలి రంగులోనే కనిపిస్తాయి. ధైర్యం, పౌరుషం, ధృఢ సంకల్పం, క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కోగల సామర్థ్యం, స్థిరమైన మనసు వంటి లక్షణాలను నీలం రంగు సూచిస్తుంది. కృష్ణుడు నీలం రంగు శరీరాన్ని కలిగి ఉన్నాడు.
గులాబీ రంగు
హోలీ వేడుకల్లో ఎక్కువగా వినియోగించే రంగు పింక్. యవ్వనం, ఆరోగ్యాన్ని సూచిస్తుంది. హోలీ వేడుకలు మరింత ఉత్సాహంగా జరుపుకునే కళను ఇస్తుంది. అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడే రంగు ఇది.