ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. దుర్గ్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 14 మంది మరణించారు. కూలీలతో వెళ్తున్న బస్సు సాయంత్రం లాల్ మురోమ్ గనిలో పడిపోయిందని చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మందికి పైగా ప్రయాణిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సు గనిలో పడిపోవడంతో ఇప్పటివరకు 14 మంది మృతి చెందగా.. మిగిలిన 15 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
సమాచారం ప్రకారం కుమ్హారి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాప్రి గ్రామంలో మురం గని ఉంది. కుమ్హారి ప్రాంతంలో నిర్మించిన కేడియా డిస్టిలరీస్‌కు చెందిన బస్సు ఇది ఈ పరిశ్రమలోని కార్మికులను తీసుకువెళ్తోంది. ఈ బస్సులో 30 మంది పరిశ్రమకు చెందిన ఉద్యోగులు ఉన్నారు. ఈ బస్సు ఖాప్రి గ్రామం సమీపంలో వెళుతుండగా.. బస్సు అదుపు తప్పి 40 అడుగుల గనిలో పడిపోయింది. బస్సు గనిలో పడిపోవడం గమనించిన స్థానికులు వెంటనే ప్రమాద స్థలం దగ్గరకు పరుగులు తీశారు.
40 అడుగుల లోతైన గని
ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 40 అడుగుల కింద పడిపోయిన బస్సులోంచి ప్రజలను ఎలాగోలా బయటకు తీశారు. అనేక అంబులెన్స్‌లు, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఒక్కొక్కరుగా బస్సు లోపల నుంచి క్షతగాత్రులను, మృతదేహాలను బయటకు తీశారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
బస్సు ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోడీ
బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో జరిగిన బస్సు ప్రమాదం చాలా బాధాకరం. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి. దీంతో పాటు క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో స్థానిక యంత్రాంగం బాధితులకు అన్ని విధాలా సాయం అందించడంలో నిమగ్నమై ఉందని ప్రధాని మోడీ సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలిపారు.