అమెరికా ఇన్వెస్టిగేషన్ సంస్థ ఓ భారతీయుడి కోసం సుమారు 9 ఏళ్లుగా గాలిస్తోంది. అతడిని అదుపులోకి తీసుకోవడం కోసం ఎంతో శ్రమిస్తోంది. ఈ క్రమంలో తాజాగా అతడిని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ జాబితాలో చేర్చింది. అంతేకాక అతడి తలపై భారీ రివార్డును ప్రకటించింది. సదరు భారతీయుడి ఆచూకీ తెలియజేస్తే.. ఏకంగా 2 కోట్ల రూపాయల రివార్డు ఇస్తామని వెల్లడించింది. ఇంతకు ఆ ఇండియన్ ఎవరు.. ఎందుకు అతడిపై ఇంత భారీ రివార్డు ప్రకటించారు.. అతడెందుకు పరారీలో ఉన్నాడు వంటి వివరాలు తెలియాలంటే ఇది చదవాల్సిందే.
సుమారు తొమ్మిదేళ్ల కిందట అమెరికాలో భార్యను అత్యంత కిరాతకంగా హత్యచేసి పరారయ్యాడు ఓ భారతీయ వ్యక్తి. 2015 ఏప్రిల్ 12న మేరీల్యాండ్‌లోని హానోవర్‌లో ఈ దారుణం వెలుగు చూసింది. ఇండియన్ వ్యక్తి భద్రేశ్ కుమార్ చేతన్‌భాయ్ పటేల్.. తన భార్య పాలక్‌ను కత్తితో అత్యంత దారుణంగా పొడిచి చంపాడు. అప్పటి నుంచి అతడి కోసం అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బబీఐ) తీవ్రంగా గాలిస్తోంది. ఈ క్రమంలో తాజాగా భద్రేశ్ ను మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ జాబితాలో చేర్చడమే కాక నిందితుడిప తలపై భారీ రివార్డును ప్రకటించింది ఎఫ్‌బీఐ. అతడి ఆచూకీ తెలియజేస్తే 2.5 లక్షల డాలర్లు (భారత కరెన్సీలో రూ.2.1 కోట్లు) అందజేస్తామని పేర్కొంది.
భద్రేశ్ పటేల్, అతడి భార్య పాలక్ స్థానికంగా ఉండే డంకిన్ డోనట్ షాపులో పని చేసేవారు. ఇక హత్య జరిగిన రోజున వీరిద్దరూ రాత్రి షిఫ్ట్‌లో పని చేస్తున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత భద్రేశ్ షాప్ కిచెన్ లో పని చేస్తోన్న తన భార్య పాలక్ దగ్గరకు వెళ్లి.. ఆమెపై కత్తితో దాడి చేశాడు. అనేక సార్లు పొడిచాడు. తన భార్య మరణించింది అని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఈ దారుణంపై కేసు నమోదు చేసిన ఎఫ్‌బీఐ.. నిందితుడి భద్రేశ్ కోసం తీవ్రంగా గాలింపు చేపట్టింది.
భార్యను దారుణంగా హత్య చేసిన తర్వాత భద్రేశ్ తన అపార్ట్‌మెంట్‌కు వచ్చి కొన్ని వస్తువులు తీసుకుని న్యూజెర్సీ ఎయిర్‌పోర్టుకు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యింది. ఆ తర్వాత నుంచి అతడి ఆచూకీ లభించలేదు. అప్పటినుంచి ఎఫ్‌బీఐ నిందితుడి కోసం గాలిస్తూనే ఉంది. 2017లో అతడిని టాప్‌టెన్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ జాబితాలో చేర్చింది. తాజాగా 2.5 లక్షల డాలర్ల రివార్డు ప్రకటించింది.
ఇండియాకు తిరిగి వెళ్లే విషయంలో చోటు చేసుకున్న వివాదం కారణంగా భద్రేశ్ ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. ఘటన తర్వాత నిందితుడు భద్రేశ్ కెనడాకు లేదా భారత్‌కు తిరిగి వెళ్లి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అందుకే అతడి ఆచూకీ తెలిపితే భారీ రివార్డు ఇస్తామని ప్రకటించారు.
ఈ సందర్భంగా ఎఫ్‌బీఐ బాల్టిమోర్ ఫీల్డ్ ఆఫీస్ స్పెషల్ ఏజెంట్ ఇంఛార్జ్ గోర్డాన్ బీ జాన్సన్ మాట్లాడుతూ. ‘భద్రేశ్‌కుమార్ పటేల్‌ను మోస్ట్ వాంటెడ్ టాప్ 10లో చేర్చడానికి కారణం.. అతడు చేసిన నేరం, అత్యంత హింసాత్మక స్వభావం’ అని తెలిపారు. ప్రజల సహకారం, మా దర్యాప్తు అధికారులు కొనసాగిస్తున్న ప్రయత్నాలు భద్రేశ్‌కుమార్ పటేల్‌ను పట్టుకోవడానికి సహకరిస్తాయి. త్వరలోనే అతడిని న్యాయస్థానం ముందు అప్పగిస్తాం‘‘ అని తెలిపాడు